
మే 14న రామప్పకు మిస్‌వరల్డ్ టీం
ములుగు: మే 14న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను విజిట్ చేయడానికి మిస్ వరల్డ్ టీం రానున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్‌జీ, సంపత్‌రావుతో కలిసి రామప్పలో చేపట్టనున్న ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రపంచ సుందరీ పోటీలలో పాల్గొననున్న పలు దేశాలకు చెందిన మహిళలు రామప్ప సందర్శనకు వస్తున్న తరుణంలో ములుగు జిల్లా ప్రవేశ మార్గమైన మహ్మద్‌గౌస్‌పల్లి నుంచి జంగాలపల్లి వరకు, జంగాలపల్లి నుంచి రామప్ప వరకు, రామప్ప నుంచి హరిత హోటల్ వరకు పంచాయతీరోడ్డు ఇంజనీరింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా మరమ్మతులు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పర్యటన వివరాలను తెలుసుకొని ఏర్పాట్ల విషయంలో ఎప్పటికప్పుడు ఫొటోలు వాట్సాప్ గ్రూప్‌లలో పోస్ట్ చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా ముందుకుసాగి ప్రపంచ మిస్ వరల్డ్ టీం పర్యటనను విజయవంతంగా ముగించాలని సూచించారు. ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, డీఎస్పీ రవీందర్, పురావస్తు శాఖ అధికారులు, వెంకటాపురం(ఎం) మండల అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలి
కలెక్టర్ టీఎస్.దివాకర