
నిర్దేశిత కాలవ్యవధిలో చార్జిషీట్లు సమర్పించాలి
ములుగు: ప్రతీ కేసును క్షుణ్ణంగా విచారించి నిర్దేశిత కాలవ్యవధిలో న్యాయస్థానానికి చార్జిషీట్లు సమర్పించాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయ సంబంధిత కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాక్షులను హాజరుపర్చడంపై బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సమన్వయంగా ఉంటూ కేసుల పరిష్కారాన్ని వేగంగా ముందుకుసాగేలా చూడాలని తెలిపారు. న్యాయస్థానాల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలన్నారు. ప్రతీ అధికారి తన విధులను నిబద్ధతతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. వారెంట్లను అమలు చేసి అనుమానితులను, నేరస్తులను సకాలంలో సురక్షితంగా న్యాయస్థానాలకు తరలించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయడమే పోలీసుల ప్రధా న బాధ్యత అన్నారు. ఈ సమీక్షలో డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్సై జగదీశ్, ఐటీ సెల్ సిబ్బంది రాజేంద్రప్రసాద్, సంధ్య, లైజనింగ్ అధికారులు, ట్రైనీ ఎస్సైలు పాల్గొన్నారు.
‘పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలి’
ములుగు: ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ఎదుట నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గందె జగన్నాధం, బానోత్ దేవ్‌సింగ్‌లు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం నేడు కాలం వెళ్లదీస్తూ వస్తుందని పేర్కొన్నారు. పెండింగ్ డీఏ, డీఆర్‌లను ప్రకటించాలని, పీఆర్సీ, 2023 జులై నుంచి అందాల్సిన మానిటరి బెనిఫిట్స్ అందించాలని కోరారు. ఈహెచ్‌ఎస్, హెల్త్ కార్డులపై చికిత్స అందించాలని కోరారు. 2024 మార్చి తర్వాత పదవీవిరమణ పొందిన వారికి అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు.
ఎంజేపీ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు షురూ
ఏటూరునాగారం: ములుగులోని మహాత్మాజ్యోతిరావుపూలే మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆడ్మిషన్లు ప్రారంభం అయినట్లు కళాశాల ప్రిన్సి పాల్ చెన్న సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రస్తుతం కాజీపేట మండల పరిధిలోని సోమిడిలో కొనసాగుతుందని వివరించారు. మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థినులు మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 9491685294లో సంప్రదించాలని కోరారు.
సర్వే పనుల అడ్డగింత
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్న తమకు సరైన న్యాయం జరగకతేనే సర్వే పనులను ముందుకు సాగనివ్వమని రైతులు ఆర్డీఓ రవికి మొరపెట్టుకున్నారు. సర్వే పనులకు రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు.
మే మొదటివారంలో ట్రస్టుబోర్డు?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ట్రస్టుబోర్డు (పాలక వర్గం) నియామకానికి మే మొదటి వారంలోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. మే 15నుంచి 26వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంతో ట్రస్టుబోర్డు నియా మకం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టుబోర్డు కోసం జనవరి 6న నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల వారు ఽట్రస్టుబోర్డు డైరెక్టర్ల కోసం 86కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ధృవీకరణ పత్రాలు, పోలీసు కేసులు, ఇతర వ్యవహారాలు, వివరాలు సరిగ్గా లేని వారిని స్క్రూటినీలో తీసివేశారు. అన్ని సరిగ్గా ఉన్న 41మందిలో నుంచి 14మందిని డైరెక్టర్ల కోసం మంత్రి శ్రీధర్‌బాబు ఎంపికచేసి దేవాదాయశాఖకు లేఖ పంపించనున్నట్లు సమాచారం. ట్రస్టుబోర్డులో ఎక్స్‌అఫీషియోతో 15మంది డైరెక్టర్లు కాగా అందులో ఒక్కరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు మంత్రి శ్రీధర్‌బాబు ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.