
మూసీ.. అడుగంటుతోంది!
కేతేపల్లి: మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ వేగంగా అడుగంటుతోంది. దాదాపు ఆరు నెలల నుంచి వర్షాలు లేకపోవడం.. ప్రస్తుతం ఎండలు ముదరడానికితోడు ప్రాజెక్టు ఆయకట్టులోని పంటలకు రెండు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ రిజర్వాయర్‌లో రోజు రోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 623.50 అడుగులకు పడిపోయింది.
33 వేల ఎకరాలకు సాగునీరు..
మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టులో పరిధిలోని నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. గత ఏడాది జూన్‌లో మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో వానాకాలం, యాసంగి సీజన్‌లో రెండు పంటలకు నీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 20నుంచి యాసంగి పంట సాగుకు మూసీ కుడి, ఎడమ కాల్వలకు అధికారులు మొదటి విడత నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆయా కాల్వలకు చివరిదైన నాలుగవ విడత నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాల్వకు 201 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 147 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
రోజూ 20 క్యూసెక్కుల నీటివృథా!
ఆవిరి, స్పీకేజీ, లీకేజీ రూపంలో ప్రతిరోజూ 20 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. ఆయకట్టులో ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి వరిపంట కోతకు రావడంతో ఒకట్రెండు రోజుల్లో కాల్వలకు నీటి విడుదలను నిలిపి వేయనున్నారు. 4.46టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.75 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మరో ఎనిమిది అడుగుల నీరు తగ్గితే నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. 615(0.5 టీఎంసీలు) అడుగులకు నీటిమట్టం చేరితే దుర్వాసన, ఒండ్రుతో కూడిన నీరు మాత్రమే రిజర్వాయర్‌లో ఉంటుంది. కనీసం పశువులు తాగేందుకు కూడా వీలుండదు. మరో రెండు నెలలు గడిస్తే గాని వర్షాలు కురిసి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటే ప్రమాదముందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్ వరిపంట చేతికొచ్చే వరకు నీరందిస్తారోలేదోనని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు ప్రస్తుతం 623.50 అడుగులకు పడిపోయిన నీళ్లు
ఫ నీటిమట్టం తగ్గితే డెడ్ స్టోరేజీకి..