
వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
● శుభలేఖలు పంచుతూ రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
● అదే దారిలో ఆటోలో వెళ్తూ
కుమారుడి మృతదేహాన్ని గుర్తించిన తల్లి
పాములపాడు: వారం రోజుల్లో పెళ్లి. ఇంట్లో కుటుంబీకులంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. రోజులు సమీపిస్తుండటంతో హడావుడి మొదలైంది. అంతలోనే విషాదం నెలకొంది. శుభలేఖలు పంచుతూ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై కంబాలపల్లి సమీపంలో సోమవారం బైక్, బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఆత్మకూరు పట్టణం ఏకలవ్యనగర్‌కు చెందిన ఈసారి నాగేంద్ర(24)కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 29న ముహూర్తం, 30న తలంబ్రాలుగా నిర్ణయించారు. పెళ్లి పనుల్లో భాగంగా తమ బంధువులకు శుభలేఖలు పంచేందుకు నాగేంద్ర సోమవారం బైక్‌పై లింగాల గ్రామానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా కంబాలపల్లి గ్రామ సమీపంలో నేషనల్ హైవేకు చెందిన బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడి తల్లి నాగసుబ్బమ్మ పాములపాడులో పని చూసుకుని ఆటోలో ఆత్మకూరుకు బయలుదేరింది. మార్గమధ్యలో కంబాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడు ధరించిన దుస్తులను గుర్తించి నాగ సుబ్బమ్మ అనుమానంతో ఆటో దిగింది. దగ్గరికి వెళ్లి చూడగా చనిపోయింది తన కొడుకే అని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘వారం రోజుల్లో పెళ్లి కొడుకువు కావాల్సిన వాడివి ఇలా ఎందుకు చనిపోయావు’ అంటూ ఆమె రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి నాగసుబ్బమ్మ, తండ్రి కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపారు.

వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం