
మిర్చి రైతుకు మిగిలింది కన్నీరే!
సంజామల: ఆరుగాలం కష్టించి, లక్షల రూపాయల వ్యయం చేసి మిర్చి సాగు చేసిన రైతుకు నష్టమే మిగులుతోంది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో కన్నీరే మిగులుతోంది. బనగానపల్లె నియోజకవర్గంలో మొత్తం 9,198 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సంజామలలో 4,200, కోవెలకుంట్లలో 2,605, బనగానపల్లెలో 1,733, అవుకులో 430, కొలిమిగుండ్ల మండలంలో 230 ఎకారాల్లో మిర్చి పంట వేశారు. ఆరు నెలలు నుంచి తెగుళ్లు, వైరస్ బారి నుంచి పైరును కాపాడుకున్నారు. అయితే పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. దళారులు అడిగిన ధరకే కొందరు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ధర వస్తుందన్న ఆశతో మరికొందరు కోల్డ్ స్టోరేజీల్లో మిర్చిని ఉంచుతున్నారు.
పాతాళానికి మిర్చి ధరలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి సాగు రైతులకు కలిసొచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.56 వేల వరకు ధర లభించింది. క్వింటా బ్యాడిగ రకం మిర్చికి 2022–23లో రికార్డు స్థాయిలో రూ.56 వేల వరకు ధర లభించింది. ఆ తర్వాత కూడా క్వింటా మిర్చిని రూ.20 వేలు నుంచి రూ.25 వేలు వరకు రైతులు విక్రయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో క్వింటా మిర్చి రూ.12 వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం క్వింటా రూ.8 వేలకే అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్టుబడి కూడా దక్కే అవకాశం లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. మార్కెట్‌లో ధర తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు.
ఇదీ దుస్థితి.,.
గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉండేవారు. మిర్చి వేసిన రైతుకు గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేది. ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద రూ.1,3500 అన్నదాతల బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యేది. ప్రకృతి వైపరీత్యంతో రైతు నష్టపోతే పంట నష్టం పథకం పరిహారం అందించేది. గత ప్రభుత్వంలో కేజీ మిర్చి ధర రూ.250తో కూడా రైతు అమ్ముకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుకు అన్నదాత సుఖీభవ పథథకం అందలేదు. ప్రతి రైతుకు రూ.20 వేలు అర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. వాతావరణం అనుకులించక రైతు నష్టపోతుంటే పంట నష్టం పథకాన్ని అమలు చేయడం లేదు. ప్రస్తుతం కేజీ మిర్చిని రూ.85కే అమ్ముతున్నారు. ఎకరాకు దాదాపు రూ.2లక్షలు పెట్టుబడి అవుతుంటే గిట్టుబాటు ధరలేక రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇవీ కష్టాలు..
మిర్చి సాగు చేసిన రైతులు రెండు కోతలు పూర్తి చేసుకుని చివరి కోతకు సిద్ధం అయ్యారు.
ఎకరాకు చివరి కోతకు దాదాపు 20 నుంచి 30 కూలీలు అవసరం.
కూలీలు అందుబాటులో లేక ఇతర గ్రామాల నుంచి తీసుకు రావాల్సి వస్తోంది.
కూలీల రవాణా ఖర్చు, ట్రాక్టర్ బాడుగ భారంగా మారింది.
మొదట రెండు కోతల్లో అంతంత మాత్రమే దిగుబడులు వచ్చాయి.
మార్కెట్‌లో లభించని గిట్టుబాటు ధర
దిగుబడులు నష్టానికి అమ్ముకుంటున్న వైనం
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
క్వింటా మిర్చి రూ.8వేలు మాత్రమే!