
అహోబిలంలో వసంతోత్సవాలు ప్రారంభం
ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వసంతోత్సవాలకు బుధవారం రాత్రి అంకుర్పారణ పూజలు చేశారు. అహోబిలం ముద్రకర్త కిడాంబి వేణుగోపాలన్, మఠం మేనేజర్ మాధవన్, మణియార్ సౌమ్యానారాయణ్‌ల పర్యవేక్షణలో పండితులు, అర్చకులు శస్త్రోక్తంగా వసంతోత్సవాలకు శ్రీ కారం చుట్టారు. దిగువ అహోబిలంలోని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిచారు. అనంతరం విశ్వక్సేనుడికి పూలమాలలు వేసి, తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ ఉత్సవాలకు పర్యవేక్షుకుడిగా విశ్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న పుట్టకు పూజలు నిర్వహించి పుట్టమన్నును సేకరించి మండపం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ అంకుర హోమం నిర్వహించి సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలను పోసి సోమకుంభ స్థాపన చేశారు.

అహోబిలంలో వసంతోత్సవాలు ప్రారంభం