
అమాయక ప్రజలపై ఉగ్రవాదుల దాడి దారుణం
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో అమాయక ప్రజలపై ఉగ్రవాదుల దాడి దారుణమని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ చెన్నమ్మ సర్కిల్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. ఈ అమానుష దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రమౌళి, మధుసూదన్‌తో పాటు మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.