
ఆర్‌యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో గందరగోళం వీడటం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యతో నెట్టుకురావడం తప్ప పరిష్కార మార్గాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈనెల 23న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు కళాశాలల విద్యార్థులకు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు కూడా హాల్‌టికెట్లు రాకపోవడంతో ఆందోళన చెందారు. దీంతో పాటు విద్యార్థుల వివరాలతో కూడిన ప్రింటెండ్ ఓఎమ్మార్ షీట్లు ఏర్పాటు చేయలేకపాయారు. డోన్‌లో ఓ పరీక్ష కేంద్రం, కర్నూలులో ఓ పరీక్ష కేంద్రంలో సుమారు 90 మంది విద్యార్థులతో బఫర్ ఓమ్మార్ షీట్లలో వివరాలు నమోదు చేయించి పరీక్ష రాయించారు. వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాటు చేస్తే ఆ విద్యార్థి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. గురువారం జరిగిన పరీక్షకు కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో శాంతినికేతన్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడటం పర్యవేక్షణ లోపమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిరాక్స్ ప్రశ్నపత్రాలు
రెండు పరీక్ష కేంద్రాల్లో ప్రింటెండ్ కాకుండా జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు రాయిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అర గంట ముందు ప్రశ్నపత్రాల షీల్డ్‌బండిల్‌ను తెరుస్తారు. అందులోంచి ప్రశ్నపత్రాలను తీసుకొని వాటిని జిరాక్స్ తీయించి పరీక్షలు రాయిస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నా పత్రం లీక్ అయినా, కరెంట్ పోయినా, ప్రింటర్ పనిచేయకపోయినా ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వెబ్‌సైట్‌లో కానరాని విద్యార్థుల పేర్లు
2023–25 విద్యా సంవత్సరం బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును శుక్రవారంలోగా చెల్లించేందుకు వర్సిటీ అధికారులు గడువు విధించారు. అయితే గురవారం అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపుకు ఎన్‌ఆర్‌లో విద్యార్థుల పేర్లు పెట్టలేదు. దీంతో ఒక్కరోజులోనే విద్యార్థులకు ఎప్పుడు సమాచారం ఇవ్వాలి, ఫీజు ఎప్పుడు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.
ఏజెన్సీ మారడంతో సమస్యలు
పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష నిర్వహణ ఏజెన్సీ మారడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నవుతున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తాం. వీసీతో చర్చించి బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటాం. ఒక విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ దొరకడంతో అతనిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేశాం.
– డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, సీఈ, ఆర్‌యూ
గురువారం ఒక విద్యార్థికి బదులు
మరో విద్యార్థి పరీక్ష రాస్తుండగా
గుర్తింపు
బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు
చెల్లింపు నేటితో గడువు పూర్తి
ఫీజు చెల్లింపునకు వెబ్‌సైట్‌లో
కానరాని విద్యార్థుల పేర్లు