
అహోబిలం.. ‘వసంత’ వైభవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. వేడుకల కోసం దేవాలయం ఎదరుగా భాష్యకార మండపంలో ఆకర్షణీయంగా మండపాన్ని తీర్చిదిద్దారు. అలాగే పలురకాల వృక్షాల ప్రతిరూపాలతో నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. గురువారం ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచారు. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.