
సాగు పెరిగి.. నష్టాలు మిగిలి
ఉమ్మడి జిల్లాలో పొగాకు సాగు లేని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు సాగు చేసిన రైతులు ఉన్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలుకు తీసుకొని మరీ సాగు చేశారు. 2023–24లో రికార్డు స్థాయి ధరలు లభించడంతో ఈ ఏడాది రైతులు సాగుకు రెండు జిల్లాల్లో పోటీపడ్డారు. కంపెనీలు కూడా అదేవిధంగా ప్రోత్సహించాయి. 2024–25లో కర్నూలు జిల్లాలో 36,471 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 30,865 ఎకరాల్లో పొగాకు సాగయింది. 2023–24తో పోలిస్తే 48,959 ఎకరాల్లో అదనంగా సాగు చేయడం విశేషం. విత్తనం మొదలు పొగాకును కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే వరకు ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు సగటున 4 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. కంపెనీలు అరకొరగా కొనుగోలు చేసి చేతులెత్తేయడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు.