రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
నంద్యాల: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... నేషనల్ హైవే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌లో బోర్డులు ఏర్పాటు చేయాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. యన్‌హెచ్40 రహదారి చాబోలు సమీపంలో, శాంతిరాం ఆసుపత్రి దగ్గర బ్యారికేడ్లతో పాటు ఇల్యూమినేషన్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 23 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, అందులో 11 పూర్తి కాగా ఇంకా 12 పెండింగ్ ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చేలా ఐరాడ్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లపై మార్కింగ్స్ వేయాలని సూచించారు.
మలేరియా నివారణ
అందరి బాధ్యత
గోస్పాడు: మలేరియా నివారణ అందరి బాధ్యత అని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ అన్నారు. నంద్యాలలోని కార్యాలయంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆరోగ్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘మలేరియా అంతం మనతోనే’ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోందన్నారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు
నంద్యాల(అర్బన్): జిల్లాలో తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీలో కనీస పనిదినాలు కల్పించాలని తెలిపారు. అయితే కంటే తక్కువ పనిదినాలు కల్పించిన తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. గోపాలాపురం గ్రామంలో రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణాపురంలో మహేష్‌చౌదరి, తిమ్మాపురంలో చాకలి శేఖర్, నేలంపాడులో వెంకటేశ్వరరెడ్డి, తిరుపాడు గ్రామానికి చెందిన శేఖర్, గుంజలపాడు గ్రామంలో గోవిందరెడ్డి, కడుమూరులో రమేష్, గుంతనాలలో రమేష్‌బాబు, రాయమాల్పురంలో దేవన్నలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు.
కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న రాత పరీక్ష
కర్నూలు: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష 2023 జ నవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి 2024 డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశా రు. ఇందులో అర్హత సాధించిన వారందరికీ జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
తనయుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య
కర్నూలు: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కుమారుడు భరత్‌బాబు ఫెయిల్ అయ్యాడనే మనస్థాపంతో తల్లి బెజవాడ లక్ష్మీజ్యోతి (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవి, లక్ష్మీజ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా మొదటి కుమారుడు భరత్ బాబు పదవ తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. బుధవారం ఫలితాలు వెలువడగా రాత్రి తల్లి లక్ష్మీజ్యోతి ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఉరి నుంచి తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


