సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే

Published Wed, Apr 23 2025 8:13 AM | Last Updated on Wed, Apr 23 2025 8:49 AM

సంక్ర

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే

● ఉమ్మడి జిల్లాలో రూ.150.04 కోట్లతో 1,916 పనుల ప్రారంభం ● కర్నూలు జిల్లాలో వంద శాతం, నంద్యాల జిల్లాలో 98.84 శాతం పనుల పూర్తి ● ఇప్పటి వరకు విడుదలైన మొత్తం రూ.23.75 కోట్లు ● నాలుగు నెలలుగా పెండింగ్‌లో రూ.126.29 కోట్లు ● నైరాశ్యంలో చోటా కూటమి నేతలు

కర్నూలు మండలం ఆర్‌.కొంతలపాడులో వేసిన సీసీ రోడ్డు

కర్నూలు(అర్బన్‌): పల్లెల్లో అంతర్గత రోడ్లపై ఆర్భాటం చేశారు. గ్రామానికి ఒక రోడ్డును మంజూరు చేసి పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారాలను హోరెత్తించారు. పల్లె పండుగ వారోత్సవాలంటూ గత ఏడాది అక్టోబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహ భాగం సర్పంచ్‌లు వైఎస్సార్‌సీపీ వర్గీయులే ఉన్నా, వారి మాటను ఖాతరు చేయకుండా చోటా కూటమి నేతలు తమ ఇష్టారాజ్యంగా రోడ్లను మంజూరు చేయించుకున్నారు. చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాదాపు అన్ని పనులను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేశారు. అయితే సంక్రాంతి, శివరాత్రి, ఉగాది పండుగ పోయినా, నేటికీ బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు చేసిన చోటా కూటమి నేతలు తీవ్ర నైరాశ్యంలో ఉండిపోయారు. గ్రామాల్లో అప్పులు చేసి పనులు పూర్తి చేసిన వారు నేడు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక దిక్కులు చూస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని అపద్దపు ఆరోపణలు చేసిన కూటమి నేతలు ప్రస్తుతం తమ ప్రభుత్వంలో బిల్లుల విడుదలలో నెలకొన్న జాప్యంపై నోరు మెదపని స్థితిలో ఉన్నారు. చేసిన పనులకు చేసినట్లుగా ఎం.బుక్‌ రికార్డు చేసి బిల్లులను అప్‌లోడ్‌ చేసిన రెండు, మూడు రోజుల్లోనే బిల్లులు పడిపోతాయని చెప్పిన దానికి, ప్రస్తుత పరిస్థితికి పొంతన లేకపోవడం గమనార్హం.

రూ.150.04 కోట్లతో 1,916 పనులు

వారోత్సవాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.150.04 కోట్లతో మొత్తం 1,916 పనుల్లో భాగంగా 270.25 కిలోమీటర్ల మేర గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలని పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటి వరకు 268.51 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పనులను సంక్రాతి పండుగ నాటికి పూర్తి చేయాలని నిర్ణీత గడువును కూడా విధించిన నేపథ్యంలో పల్లెల్లో కూటమి పార్టీలకు చెందిన నేతలు హడావుడిగా పనులను పూర్తి చేశారు.

అదే దారిలో బీటీ రోడ్ల పనులు

సీసీ రోడ్ల దారిలోనే బీటీ రోడ్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 4, నంద్యాల జిల్లాలో 3 పనులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూ.13.30 కోట్లతో 14.89 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లను వేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 3.60 కిలోమీటర్లు మాత్రమే వేశారు. ఈ పనులకు కూడా ఇప్పటి వరకు నయాపైసా విడుదల కాని పరిస్థితి.

నెలాఖరుకు బిల్లులు

విడుదలయ్యే అవకాశం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, ఇతరత్రా పనులకు ఈ నెలాఖరులోగా బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఉపాధి పనులకు సంబంధించి మెటీరియల్‌ కాంపోనెంట్‌, వేతనాలకు బిల్లులను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన సీసీ రోడ్ల పనుల బిల్లులు కూడా విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.23.75 కోట్లు విడుదల కాగా, ఇంకా రూ.126.29 కోట్లు విడుదల కావాల్సి ఉంది. చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులను అప్‌లోడ్‌ చేశాం.

– వి.రామచంద్రారెడ్డి, పీఆర్‌ ఎస్‌ఈ

నాణ్యత కూడా అంతంత మాత్రమే..

రూ.126.29 కోట్ల వరకు బకాయిలు

ఆయా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.126.29 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ నెలలో కర్నూలు జిల్లాకు రూ.14.80 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.8.95 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. సీసీ రోడ్లతో పాటు భవనాలు, ప్లాంటేషన్‌, మినీ గోకులాలు, బీటీ రోడ్లు, ఇతరత్రా పనులకు సంబంధించిన బిల్లులు కూడా కోట్ల రూపాయాల్లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగంగా చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులు విడుదల కాకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన క్వాలిటీపై కూడా దృష్టి సారించనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వేగంగా సీసీ రోడ్లు వేయడం, క్యూరింగ్‌ కూడా సరిగా చేయనట్లు తెలుస్తోంది. రోడ్ల నాణ్యత పట్ల పీఆర్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఇంజనీర్లు కూడా అధిక రోడ్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో సమయం తక్కువగా ఉండడంతో ఆయా పనుల పట్ల పూర్తి స్థాయిలో దృష్టి సారించనట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,916 పనుల్లో ఇప్పటి వరకు 50 శాతం పనులను కూడా క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్లు చెక్‌ చేయకపోవడం గమనార్హం. నాణ్యత పరిశీలించిన పనుల్లో కూడా దాదాపు 50 నుంచి 60 శాతం పనుల్లో రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. కాగా పూర్తయిన పనులకు వంద శాతం బిల్లుల చెల్లింపు జరగదని, మొత్తం బిల్లులో 15 శాతాన్ని డిపాజిట్‌గా ఉంచుకొని, క్వాలిటీ చెక్‌ చేసిన అనంతరం డిపాజిట్‌గా ఉంచుకున్న మొత్తాన్ని విడుదల చేస్తారని ఇంజనీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే 
1
1/2

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే 
2
2/2

సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement