
సివిల్స్‌లో పవన్ విజయం
● సత్తా చాటిన కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థి ● మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లొచ్చారు ● రెండో ప్రయత్నంలో 375వ ర్యాంకు
కర్నూలు సిటీ: సివిల్స్ ఫలితాల్లో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి 375వ ర్యాంకు సాధించారు. కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన(ప్రస్తుతం కర్నూలులోని ఎన్.ఆర్‌పేట్‌లో ఉంటున్నారు) ఎం.కృష్ణారెడ్డి, ఎం.మధుమతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ఎం.పవన్‌కుమార్ రెడ్డి కర్నూలు మెడకల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించే సమయంలోనే కుటుంబ సభ్యుల సలహా, సూచనల మేరకు సివిల్స్‌కు సన్నద్ధం అయ్యారు. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లొచ్చారు. రెండో సారి 2024 నోటిఫికేషన్‌లో మెడికల్ సైన్స్ అప్షనల్ సబ్జెక్టు ఎంపిక చేసుకోని 375వ ర్యాంకు సాధించారు. తండ్రి ఎం.కృష్ణారెడ్డి కర్నూలు రూరల్ మండలం పంచలింగాల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగాను, తల్లి ఎం.మధుమతి.. ఆర్.కొంతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో కుమారుడు పవన్ కుమార్ రెడ్డి.. కర్నూలు నగరంలోని ప్రైవేటు స్కూళ్లలోనే హైస్కూల్ విద్య పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ విద్య గుంటూరులోని ఓ కార్పొరేట్ కాలేజీలో చదివి, ఏపీ ఎంసెట్(అప్పటికి నీట్ ఉండేది కాదు)లో రాష్ట్ర స్థాయిలో 600వ ర్యాంకు రావడంతో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదివారు. మెడిసిన్ 2022లో పూర్తి అయ్యాక సివిల్స్ ప్రిపేర్ కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో 2023లో మొదటిసారి మొదటిసారి ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మరోసారి 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసి, గతేడాది జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత సాధించారు. సెప్టెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలు రాసి ఈ ఏడాది జనవరి 17న ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 8నుంచి 10 గంటల పాటు, పరీక్షల సమయంలో 12 గంటల పాటు చదివేవాడినని వెల్లడించారు. సివిల్స్ సన్నద్ధం కావాలనుకునేవారు ఇష్టమైన సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించారు. రోజుకు కనీసం 10 గంటలు చదివితేనే సివిల్స్‌లో ర్యాంకు సాధించవచ్చునని తెలిపారు. తమ కుమారుడు సివిల్స్‌లో ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

సివిల్స్‌లో పవన్ విజయం