
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
రుద్రవరం: మండల కేంద్రంలోని బెస్త కాలనీలో సోమవారం విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ జనార్దన్(42) మృతి చెందాడు. కాలనీ వాసులు తెలిపిన వివరాలు.. జనార్దన్ కొన్నేళ్లుగా కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు విద్యుత్ స్తంభాలకున్న డిష్ తీగలను సరిచేస్తూ ఉండటాన్ని అదిగమనించిన విద్యుత్ లైన్‌మెన్ ఖాజామొహిద్దీన్.. బెస్త కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలు సరి చేయాలని కోరాడు. లైన్‌మెన్ నిచ్చెన పట్టుకోగా కేబుల్ ఆపరేటర్ స్తంభంపైకి చేరుకొని విద్యుత్ తీగలను సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు అందిస్తుండగానే మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు. ఎస్‌ఐ వరప్రసాదు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.