
బ్రిటీష్‌వారి బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడంలో మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మహాత్ముడు తన జీవితాన్ని త్యాగం చేశారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. గాంధీజీ త్యాగాన్ని స్మరించుకునేందుకు ప్రతీ ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. గాంధీ వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి, అహింస, సామరస్య మార్గాన్ని చూపింది.
అది.. 1948, జనవరి 30నాటి సాయంత్రం వేళ.. మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా భవన్‌లో జరిగే ప్రార్థనా సమావేశంలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సాయంత్రం 5:17 గంటల ప్రాంతంలో నాథూరామ్ గాడ్సే .. మహాత్మాగాంధీపై కాల్పులు జరిపాడు. గాంధీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాపూజీ మరణానంతరం, ఆయన వర్ధంతి (జనవరి 30)ని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అమరవీరుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది.
జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాల ఆర్మీ చీఫ్‌లు రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తారు. అలాగే అమరవీరులందరినీ స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలలో మహాత్మా గాంధీని గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈరోజు మహాత్ముడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, గురుతులు మనందరి మదిలో సజీవంగా నిలిచి ఉన్నాయి. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత మంత్రం నేడు ప్రతి ఒక్కరికీ చేరింది. బాపూజీ త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.