
జమ్మూ: విద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేసే కార్మికులతో వెళ్తున్న వాహనం లోయలోకి పల్టీలు కొట్టడంతో ఏడుగురు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిష్ట్‌వార్ జిల్లాలోని దఛన్ సమీపంలోని దాంగ్‌దూరు విద్యుత్ ప్రాజెక్ట్ దగ్గర్లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్ సైట్ సమీపంలో ప్రమాదం జరగడంతో వందలాది మంది కార్మికులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల కుటుంబాలకు కంపెనీనే నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు తక్షణ ఆర్థికసాయం అందించాలని నిరసనకు దిగారు.
భారీ వర్షం పడుతుండటంతో డ్రైవర్‌కు సరిగా కనిపించకపోవడంతో కొండ మలుపులో వాహనం అదుపుతప్పింది. దీంతో కొండ నుంచి వందల మీటర్ల లోయలోకి వాహనం పల్టీకొట్టి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు జార్ఖండ్ కార్మికులుసహా ఏడుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా పలు పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.