
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ఆటోలపై నిషేధం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పష్టత నిచ్చారు. సీఎన్‌జీ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారనే వార్తలను మంత్రి పంకజ్ కుమార్ సింగ్ కొట్టిపారేశారు. సీఎన్‌జీతో నడిచే ఆటోరిక్షాలపై నిషేధం విధిస్తామన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఢిల్లీ సర్కార్ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎలాంటి ఆటోలను తాము నిలిపివేయబోమని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.
త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ ఆటోలపై బ్యాన్ విధిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ సీఎన్‌జీ ఆటోలపై నిషేధం విధించబోమంటూ క్లారిటీ ఇచ్చేశారు.