
ఎంపీలు నిశికాంత్ దూబే, దినేష్ శర్మలపై చర్యలు తీసుకోవాలి
వీరి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్న నడ్డాపై కాంగ్రెస్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలపై ఆ పార్టీ చర్యలెందుకు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. వారి విమర్శలు వ్యక్తిగతమని చెబుతూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం రాజకీయ వంచనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఎంపీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం షోకాజ్ నోటీసులు ఎందుకివ్వలేదు?’ అని నిలదీశారు.
తరచూ వివిధ వర్గాలు, వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా విద్వేష, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలకు పార్టీతో సంబంధం లేదంటూ దూరంగా ఉండటం కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మౌనంగా ఉండటం తగదని పేర్కొన్నారు. ఒక వేళ ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవిస్తోందా? అని జేపీ నడ్డాను ప్రశ్నించారు.
భారత రాజ్యాంగంపై ఇలా పదే పదే జరుగుతున్న దాడులపై ప్రధాని మౌనంగా ఉండటమంటే వారికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని జైరామ్ రమేశ్ అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ వంచన అని ఆయన అభివర్ణించారు. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ నిశికాంత్ దూబే పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు, వక్ఫ్ చట్టంపై చేసిన వ్యాఖ్యలు ధిక్కారం కిందికే వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘ఇది కోర్టు ధిక్కారానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన స్పష్టమైన కేసు. తేలిగ్గా తీసుకోలేం. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఈ ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
న్యాయవ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన ప్రత్యక్ష దాడి. స్పీకర్, సుప్రీంకోర్టు ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’ అని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఎంపీ దూబే శనివారం సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం తెల్సిందే. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తుంటే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలను మూసివేసుకోవాల్సిందేనన్నారు. దేశంలో సివిల్ వార్‌లకు సీజేఐ కారణమని నిందించారు.
అదేవిధంగా, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఇటీవల.. పార్లమెంట్‌ను, రాష్ట్రపతిని ఎవరూ ఆదేశించలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే, వీరి వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగతం. పార్టీ వీటితో ఏకీభవించదు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతివ్వదు. పూర్తిగా తిరస్కరిస్తుంది’ అని నడ్డా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.