
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్‌జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.
ఆ కుటుంబాలకు ఆర్థికసాయం
జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు.
రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ
ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు.