
ప్రధాని మోదీకి మాక్రాన్, మెలోనీ ఫోన్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉదంతాన్ని ఇరాక్, జోర్డాన్, ఖతార్ తదితర అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు సంఘీభావం ప్రకటించిన ఈ దేశాలు, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి. యూరప్ దేశాల సమాఖ్య ఈయూ కూడా దారుణాన్ని ఖండించింది. భారత్‌కు సంఘీభావం తెలిపింది. లక్ష్యమేదైనా, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందేనని స్పష్టం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
దేశ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించే ఇటువంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా, పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని మోదీకి గురువారం ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్ చేసి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు వారు సానుభూతి తెలిపారు. అమాయకులను దారుణంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల పైశాచికాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మెలోనీ, మాక్రాన్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారని, దాడికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పారని విదేశాంగ శాఖ తెలిపింది.