
పహల్గాంలో హేయమైన ఉగ్రదాడి తర్వాత సింధూ నదీజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించాక అందుకు ప్రతీకార నిర్ణయంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడో దేశం జోక్యం చేసుకోవద్దనే ప్రధాన అజెండాగా రూపుదిద్దుకున్న సిమ్లా ఒప్పందం నుంచి పక్కకు జరుగుతున్నట్లు పాక్ ప్రకటించింది.
దీంతో దశాబ్దాలుగా రావణకాష్టంగా రగలిపోతున్న కశీ్మర్ అంశంలో ఇకపై అమెరికా వంటి సంపన్న దేశాలు పెద్దమనిషిలా దూరిపోయి అంశాన్ని మరింత జఠిలం చేసే ప్రమాదముందనే సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సిమ్లా ఒప్పందంలో ఏమేం అంశాలు ఉన్నాయి?. వాటి ప్రాధాన్యత ఏమిటి? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
1972లో సాకారం..
తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా విమోచన పొందడంలో భారత ప్రమేయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారత్‌పైకి పాకిస్తాన్ దాడికి తెగించడం తదనంతర పరిణామాలతో 1971 యుద్ధం జరిగింది. 1971లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం ముగిశాక శాంతిస్థాపనే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు మొగ్గుచూపాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకుని, సాధారణ పరిస్థితులు నెలకొనడమే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు పచ్చజెండా ఊపాయి.
పొరుగుదేశ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నియంత్రణ రేఖను ఇష్టమొచి్చనట్లు ఏకపక్షంగా మార్చకూడదనే కట్టుబాటుతో ఈ ఒప్పందం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పట్టణంలో 1972 జూలై రెండో తేదీన నాటి భారత ప్రధాని ఇందిరా గాం«దీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జులి్ఫ కర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే శాంతిస్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఇరుదేశాలు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా ఈ ఒప్పందం పేరొందింది. ఇకపై పొరుగుదేశాలుగా పరస్పర సహకారం, సామరస్యంతో మెలుగుతామని ఆనాడు ఇరుదేశాలు ప్రతినబూనాయి.
ఒప్పందంలో ఏమేం ఉన్నాయి?
భవిష్యత్తులో సరిహద్దుసహా మరే అంశంలోనైనా మనస్పర్థలు తలెత్తినా, వివాదాలు చెలరేగినా మూడో దేశానికి లేదా అంతర్జాతీయ సంఘంలో ఫిర్యాదుచేయకుండా రెండు దేశాలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నారు. మూడో దేశం జోక్యాన్ని ఈ ఒప్పందం నివారిస్తోంది. 1971లో యుద్ధం సమయంలో సరిహద్దు దాటి ముందుకు చొచ్చుకురావడం, మరి కొన్ని చోట్ల భూభాగాన్ని కోల్పోవడం వంటి ఘటనలు జరిగాయి.
ప్రస్తుతం తమ అ«దీనంలోని భూభాగాలను తమవిగా పేర్కొంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ దానినే నియంత్రణ రేఖగా ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ని యంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చడానికి వీలులేదు. యుద్ధం వేళ చాలా మంది పాకిస్తానీ సైనికులను భారత బలగాలు బంధించాయి. ఈ ఒప్పందంలో భాగంగా వారందరినీ విడిచిపెట్టారు. పాకిస్తాన్ సైతం బంగ్లాదేశ్ సాధించిన సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించింది. బంగ్లాదేశ్‌తోనూ పర స్పర గౌరవం పాదుకొల్పడమే లక్ష్యంగా ఈ అంశాన్నీ సిమ్లా ఒప్పందంలో చేర్చారు.
ఒప్పందం ప్రభావం ఎంత ? ఈ ఒప్పందం కారణంగా తదనంతరకాలంలో ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు వచి్చన ప్రతిసారీ ఈ రెండు దేశాలే సమస్యలను పరిష్కరించుకున్నాయిగానీ మరే ఇతర దేశాన్ని మధ్యవర్తిగా ఆహ్వానించలేదు. చర్చలు రెండు దేశాల మధ్యే పరిమితం కావడంతో వేగంగా సంప్రతింపులు సాధ్యమయ్యాయి. మెరుగైన పరిష్కారం సాధ్యమైంది. కశ్మీర్‌లో నియంత్రణ రేఖనే వాస్తవా«దీన రేఖగా అప్పటి నుంచి కొనసాగింది. దీంతో ఆనాటి నుంచి ఎలాంటి సరిహద్దు ఆక్రమణ ఘటనలు జరగలేదు. ఇలా ఈ ఒప్పందం భూభాగాల వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించింది.
దౌత్యపరంగా సంబంధాల కొనసాగింపునకు ఈ ఒప్పందం సుసాధ్యం చేసింది. ఇరుదేశాల మధ్య విశ్వాసం పెంచే ప్రయత్నాలు ఈ ఒప్పందం కారణంగానే జరిగాయి. అయితే ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం వంటివి తరచూ ఉల్లంఘనకు గురవడం ఒక్కటే ఈ ఒప్పందం మనుగడకు సవాల్‌గా నిలిచింది. తాజాగా పాకిస్తాన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే కశీ్మర్ అంశంపై పాక్ అనుకూల దేశాలు మధ్యవర్తులుగా బయల్దేరే ప్రమాదముంది. అప్పుడు కశీ్మర్ మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన అంశం అనే భారత వాదన అంతర్జాతీయ వేదికలపై కాస్తంత బలహీనపడే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్