
ఒకరు ప్లాన్ చేంజ్ చేసుకున్నారు.. మరొకరికి గుర్రపు స్వారీ దొరకలేదు.. ఇంకొందరైతే ఘటనకు కొద్దిసేపటి నుంచే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పహల్గాం ఉగ్రదాడినుంచి త్రుటిలో తప్పించుకున్న పర్యాటకులు ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. దాడి భయానక పరిస్థితులను, క్షతగాత్రులకు సాయం చేయడానికి, సురక్షితంగా బయటపడేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన స్థానికుల ప్రయత్నాలను వారు గుర్తు చేసుకున్నారు.
భయంతో నిద్రపట్టలేదు..
‘అక్కడికి వెళ్లడానికి.. బైసారన్ లోయకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ ట్యాక్స్ స్టాండ్ దగ్గర మేం ఉండగా గందరగోళం ప్రారంభమైంది. ప్రజలు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఆ తరువాత దాడి గురించి తెలిసింది. స్థానికుల సలహా మేరకు ఓ హోటల్‌ను సంప్రదించడంతో వారు వాహనాన్ని పంపి మమ్మల్ని అక్కడినుంచి తీసుకెళ్లారు. మేం తిరిగి వెళ్తుండగా అంబులెన్సులు, మిలిటరీ వాహనాలు పరుగులు పెట్టడం కనిపించింది. నా ఎనిమిదేళ్ల కొడుకు చాలా భయపడ్డాడు. మాట్లాడలేకపోయాడు. ఆ భయం రాత్రంతా కొనసాగింది.
నిద్రకూడా పట్టలేదు. వెంటనే ప్రయాణాన్ని కుదించుకుని తిరిగి వచ్చేశాం.’అని ఆ భయానకమైన రోజును గుర్తు చేసుకున్నారు పశి్చమబెంగాల్‌లోని హుగ్లీకి చెందిన చంచల్ డే. దాడి జరిగిన సమయంలో ఆయన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ‘‘నేను మళ్లీ కశ్మీర్‌కు వెళ్లను. అక్కడికి వెళ్లాలన్న ఆలోచన వచి్చనా పునరాలోచిస్తాను. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. నా ఆలోచన మాత్రం మా భద్రత గురించే’అని వారితో పాటు పర్యటనకు వెళ్లొచి్చన డే మరదలు బసంతి తెలిపారు.
ప్లాన్ మారి ప్రాణాలతో బయటపడ్డాం..
మహారాష్ట్రలోని అకోలాకు చెందిన విశాల్ సంగోకర్, అతని భార్య దాడి జరిగిన రోజే బైసారన్‌ను సందర్శించాలనుకున్నారు. అదృష్టవశాత్తు వారి ప్లాన్ ఒక రోజు ముందుకు మారింది. 22న దాడి జరగగా, 21న అంటే ఒక రోజు ముందుగానే బైసారన్‌లో పర్యటించారు. ‘‘ఒక రోజు ముందుగా వెళ్లడం మా అదృష్టం. లేకపోతే మేం కూడా బాధితుల్లో ఉండేవాళ్లం. మేం వెళ్లిన రోజు కూడా కొంత అసౌకర్యానికి గురయ్యాం. చుట్టుపక్కల ఎలాంటి సెక్యూరిటీ లేదు’’అని పహల్గాం అనుభవాలు పంచుకున్నారు సంగోకర్. ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్న వీరు త్వరలోనే అకోలాకు రానున్నారు.
డ్రైవర్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు..
ధారశివ్ జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు కూడా ఏప్రిల్ 22న సంఘటనా స్థలానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ‘‘అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకస్మిక దాడితో దిగ్భ్రాంతికి గురయ్యాం. ‘ఏదో సమస్య ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’అని స్థానికుడైన మా డ్రైవర్ మజీద్‌ఖాన్ చెప్పారు. మమ్మల్ని తీసుకెళ్లి వాళ్లింట్లో ఆశ్రయం కలి్పంచారు. మజీద్ మమ్మల్ని అప్రమత్తం చేయకుంటే పరిస్థితి మరోలా ఉండేది’’అంటూ ఆనాటి వాతావరణాన్ని వారు గుర్తు చేసుకున్నారు.
గుర్రం దొరక్క ప్రాణాలు దక్కాయి..
సాంగ్లీకి చెందిన సంతోష్ జగ్దాలే కుటుంబం ఊహించని ట్విస్ట్‌తో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దాడి జరిగిన రోజు ఉదయం వారు పహల్గాం వెళ్లాల్సి ఉంది. స్వారీ చేయడానికి గుర్రాలు దొరకలేదు. దీంతో బదులుగా సందర్శనకు మరొక ప్రదేశానికి వెళ్లారు. ‘‘మేం తిరిగి వచ్చేసరికి దాడి జరిగింది. ఎక్కడ చూసినా సైన్యమే. సంతోష్ జగ్దాలే అనే పేరున్న పుణేకి చెందిన మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో మా బంధువుల్లో భయాందోళనలు పెరిగి ఫోన్స్ చేశారు. నేను బతికే ఉన్నానని నిర్ధారించుకుని నెమ్మదించారు’అని సంతోష్ వివరించారు.
ప్రాణాలు కాపాడిన మటన్ రోగన్ జోష్...
కేరళలోని కొచి్చకి చెందిన 11 మంది సభ్యుల కుటుంబాన్ని మటన్ రోగన్ జోష్ ప్రాణాలతో బయటపడేసింది. వారి కుటుంబం ఏప్రిల్ 19న కశీ్మర్ చేరుకుంది. గుల్మార్గ్, సోన్మార్గ్ అందాలను ఆస్వాదిస్తూ రెండు రోజులు గడిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా రెండు రోజుల పాటు మధ్యాహ్న భోజనం చేయలేదు. దీంతో.. బైసారన్ మైదానానికి వెళ్లడానికి ముందు ఏదైనా తినాలనుకున్నారు. ఆ రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా బయలుదేరారు. రెండు రోజులుగా ఏం తినకపోవడంతో, కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న బైసారన్ చేరుకునే ముందు ఏదైనా తిందామని రోడ్డు పక్కన ఫుడ్‌స్టాల్ దగ్గర ఆగారు.
మటన్ రోగన్ జోష్ ఉప్పగా ఉండటంతో తాజాగా చేయమని రెస్టారెంట్ సిబ్బందిని అడిగారు. తిని, బైసారన్‌కు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించేపట్టికి గంట ఆలస్యమైంది. బైసారన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా గందరగోళం నెలకొంది. గుర్రాలు, ట్యాక్సీలు కిందకు వస్తున్నాయి. ప్రజలు కేకలు వేస్తున్నారు. స్థానిక భాష తెలియకపోవడంతో ముందుకు వెళ్దాం అనుకున్నారు. డ్రైవర్ స్థానికుడు కావడంతో ఎందుకైనా మంచిదని ఆరా తీశాడు. దాడి జరిగిందని, అప్పటికే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయని సమాచారం తెలిసింది. వారికి ధైర్యం చెప్పిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని వెనక్కి తిప్పాడు. క్షేమంగా హోటల్‌కు చేర్చాడు.
లేటైతే ప్రాణాలు పోయేవి..
నాందేడ్‌కు చెందిన కృష్ణ, సాక్షిల ప్రాణాలను ఓ పదిహేను నిమిషాలు కాపాడాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడానికి 15 నిమిషాల ముందే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. తాము క్షేమంగా ఉన్నామని వివరిస్తూ వారు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తిరుగు ప్రయాణానికి విమాన టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అస్సాంలోని బొంగైగావ్‌కు చెందిన బిశ్వజిత్ ఛటర్జీ కుటుంబం కూడా ఇలాగే ప్రాణాలు కాపాడుకుంది. గౌహతి మీదుగా ఏప్రిల్ 17న శ్రీనగర్‌కు చేరుకున్నవారు 19 వరకు గుల్మార్గ్‌లో ఉన్నారు. 20న పహల్గాంకు వచ్చారు. 20, 21 తేదీల్లో చాలా సరదాగా గడిపారు. 22వ తేదీన దాడి జరగడానికి రెండు గంటల ముందే బైసారన్ నుంచి వారు వెళ్లిపోయారు. వారు మరో ప్రదేశాన్ని సందర్శిస్తుండగా దాడి వార్త తెలిసింది. కాస్త ఆలస్యమైతే ఏమయ్యేదన్న ఆలోచన వస్తేనే భయమేస్తుందని వారు చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్