
చెన్నై, సాక్షి: సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే చర్చ తమిళనాట జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించిన ఆయన.. డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసరం చేసుకుంది. దీంతో ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోందన్నది ఆ ప్రచార సారాంశం.
ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన కమల్‌ను రాజ్యసభకు పంపే యోచనలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారట. తాజాగా.. బుధవారం తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
మరోవైపు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(MNM) ప్రతినిధి మురళి అప్పాస్.. తమ పార్టీకి ఓ రాజ్యసభ సీటు దక్కబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అది ఎవరనేది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసనే నిర్ణయిస్తారని తెలిపారాయన. శేఖర్‌బాబుతో కమల్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.

2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్‌ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది.