
జమ్మూ కశ్మీర్‌లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్నఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కథువా జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.