
న్యూఢిల్లీ:నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ మఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో విచారించేందుకు ఈడీ సోమవారం సమన్లు ఇచ్చింది. రేపు (మంగళవారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. గత నెల జనవరి 11న కూడా ఈడీ ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేయటం గమనార్హం. దేశంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫరూక్ అబ్దుల్లాకు రెండో సారి ఈడీ సమన్లు రావటంపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరగటం గమనార్హం.
ఇక.. 2004 నుంచి 2009 వరకు జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయని ఫరూక్ అబ్దుల్లాపై ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ క్రమంలో సీబీఐ రంగంలోకి దిగి.. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ అంశం కావడంతో సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. క్రికెట్ అసోసియేషన్‌లోని కొందరు ఆఫీస్ బేరర్‌లతో పాటు ఇతరుల బ్యాంకు నిధులు మళ్లినట్లు ఈడీ గుర్తించింది.
జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ చెందిన బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు విత్‌డ్రా అయినట్లు ఈడీ విచారణలో నిర్ధారించింది. దీంతో 2022లో ఫరూక్‌పై సీబీఐ అభియోగాలు మోపింది. శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఉన్న సమయంలో ఫరూక్ అబ్దుల్లా ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు 2001 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లా.. తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బీసీసీఐ స్పాన్సర్‌గా ఉన్న ఈ అసోసియేషన్‌లో నిధులు పక్కదారి పట్టేలా నియమకాలు జరిగాయని కూడా ఈడీ వెల్లడించింది.
చదవండి: Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు