మహా కుంభ్‌కు ఘనంగా ఏర్పాట్లు | Maha Kumbh Mela 2025 Preparations near Triveni Sangam | Sakshi
Sakshi News home page

మహా కుంభ్‌కు ఘనంగా ఏర్పాట్లు

Published Sat, Jan 4 2025 4:44 AM | Last Updated on Sat, Jan 4 2025 4:44 AM

Maha Kumbh Mela 2025 Preparations near Triveni Sangam

దేశ, విదేశాల నుంచి 40 కోట్ల మంది తరలివస్తారని అంచనా 

2013 మహాకుంభ్‌ కంటే మూడు రెట్లు పెద్దదిగా ఏర్పాట్లు 

కుంభ్‌ నగర్‌కు అత్యంత పటిష్ట భద్రత 

200 ఛార్టర్డ్‌ విమానాలు ల్యాండయ్యేందుకు ప్రణాళిక 

మూడు వేల ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వేశాఖ 

రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్న ప్రభుత్వం 

తొలిసారిగా ఏఐతో పర్యవేక్షణ

సాక్షి, న్యూఢిల్లీ: పన్నెండేళ్లకోసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభ మేళాను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వరకు 42 రోజుల పాటు గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. 

ఈ సందర్భంగా యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇందులో జనవరి 13న పుష్య పౌర్ణమిన, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు చేసే స్నానాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ స్నానం రోజుల్లో భక్తుల సంఖ్య కోట్లలో ఉండనుందన్నది అధికారుల అంచనా. 

కేవలం జనవరి 29న మౌని అమావాస్య రోజున షాహి స్నాన్‌లో గరిష్టంగా 4 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గతంలో 2013లో జరిగిన మహా కుంభమేళాతో పోలిస్తే ఇప్పుడు జరుగనున్న మహాకుంభమేళా మూడు రెట్లు పెద్దదని భావిస్తున్నారు. ఈ పవిత్ర స్నానాల కోసం గతంలో 12 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి సుమారు 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మేళా ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి.  

నాలుగు రెట్ట బడ్జెట్‌ 
మహాకుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. గతం కంటే బడ్జెట్‌ నాలుగు రెట్లు పెంచారు. ఈసారి మహాకుంభ బడ్జెట్‌ రూ.5,060 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లు ఇచి్చంది. 2013 కుంభ్‌ సమయంలో రాష్ట్రంలో సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) అధికారంలో ఉండగా.. అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013లో మహాకుంభ్‌మేళా కోసం రూ.1,214 కోట్ల బడ్జెట్‌ కేటాయించగా రూ.1,017 కోట్లు ఖర్చు చేశారు. 2025లో మహాకుంభ బడ్జెట్‌ 2013 కంటే రూ.4,043 కోట్లు ఎక్కువ కావడం విశేషం. 

38 వేల మంది జవాన్లతో భద్రత 
మహాకుంభమేళా జరుగుతున్న కుంభ్‌ నగర్‌ భద్రతను దుర్భేద్యమైన కోటలా పటిష్టం చేశారు. కుంభ్‌ నగర్‌ మాస్టర్‌ ప్లాన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రత కోసం 38 వేల మంది సైనికులను మోహరిస్తున్నారు. మొత్తం 56 పోలీస్‌ స్టేషన్లు, 144 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. రెండు సైబర్‌ స్టేషన్లను విడివిడిగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో సైబర్‌ డెస్క్‌ ఉంటుంది. కాగా, 2013 మహా కుంభ్‌లో దాదాపు 12 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 12 మంది ఏఎస్పీ, 30 మంది సీఓలు, 409 మంది ఇన్‌స్పెక్టర్లు, 4,913 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. 

వీఐపీల కోసం మహారాజా టెంట్లు 
వీఐపీల కోసం 150 మహారాజా టెంట్లతో కూడిన ప్రత్యేక నగరాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిలో ఒక్కరోజు ఛార్జీ రూ.30 వేలకు పైగా ఉంటుంది. వీటితో పాటు 1,500 సింగిల్‌ రూమ్‌లు, 400 ఫ్యామిలీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు డోమ్‌ సిటీని సిద్ధం చేశారు. వీటి అద్దె లక్షకు పైగా ఉంటుంది. మహాకుంభ్‌లో లక్షన్నర మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 300 మొబైల్‌ టాయిలెట్లు ఉన్నాయి. 2013లో మొత్తం 33,903 మరుగుదొడ్లు నిర్మించారు. ఘాట్‌ వద్ద దాదాపు 10 వేల దుస్తులు మార్చుకునే గదులను నిర్మించనున్నారు. 2013 కుంభ్‌లో దుస్తులు మార్చుకునే గదుల సంఖ్య దాదాపు రెండున్నర వేలుగా ఉన్నాయి.  

23 నగరాల నుంచి విమానాలు 
మహాకుంభమేళా కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇది 13 వేలకు పైగా ట్రిప్పులను నడుపనుంది. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రయాణికులు జనరల్‌ కోచ్‌లలో ప్రయాణిస్తారని రైల్వేశాఖ అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌తో పాటు నగరంలోని 8 రైల్వే స్టేషన్లను సిద్ధం చేశారు. అంతేగాక ఉత్తరప్రదేశ్‌ రోడ్‌వేస్‌ వేలకు పైగా బస్సులను ప్రత్యేకంగా నడుపనుంది. 

ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయం నుంచి దేశంలోని దాదాపు 23 నగరాలకు నేరుగా విమానాలు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, లక్నో, రాయ్‌పూర్, బెంగళూరు, అహ్మదాబాద్, గౌహతి, కోల్‌కతాలకు నేరుగా విమానాలు నడుస్తాయి. వీటితో పాటు మహాకుంభ్‌కు వీవీఐపీలు, విదేశీ అతిథులకు చెందిన 200కు పైగా చార్టర్డ్‌ విమానాలు ప్రయాగ్‌రాజ్‌ రానున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయంలో కేవలం 15 విమానాలకు మాత్రమే పార్కింగ్‌ స్థలం ఉంది. అందువల్ల, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నాలుగు రాష్ట్రా ల్లోని 11 విమానాశ్రయాల నుంచి పార్కింగ్‌కు సంబంధించిన నివేదికలను అందించాల ని కోరింది.  

నీటి అడుగునా నిఘాం 
మహాకుంభ్‌ అత్యంత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈసారి విద్యుత్‌కు రూ.391.04 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. మొత్తం 67 వేల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. 85 కొత్త తాత్కాలిక పవర్‌ ప్లాంట్లు, 170 సబ్‌ స్టేషన్లు నిర్మించారు. మహాకుంభ్‌లో ఆకాశంతో పాటు డ్రోన్‌ల ద్వారా నీటి అడుగున కూడా నిఘా ఉండనుంది. నీటి అడుగున భద్రత కోసం తొలిసారిగా నదిలోపల 8 కిలోమీటర్ల మేర డీప్‌ బారికేడింగ్‌ను ఏర్పాటు చేశారు. మహాకుంభ్‌లో అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 25 మెగా ఈవెంట్‌లు జరగనున్నాయి. దీనిని విదేశీ కంపెనీలు రూపొందించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక కార్యక్రమానికి, ప్రధాని నరేంద్ర మోదీ రెండు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. పదికి పైగా దేశాల అధినేతలు రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement