
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్‌ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్‌ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది.
మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు.