
ఈ ఫొటోలో కన్పిస్తున్న వ్యక్తి పేరు రాంగోపాల్ కశ్యప్. హరియాణాలోని యమునానగర్ వాసి. మోదీకి వీరాభిమాని. ఆయన ప్రధాని అయ్యేదాకా చెప్పులు వేసుకోబోనని 14 ఏళ్ల క్రితం భీషణ ప్రతిజ్ఞ చేశారు. సోమవారం యమునానగర్‌లో బహిరంగ సభ సందర్భంగా మోదీ ఆయన్ను కలిశారు.
బూట్లు కానుకగా ఇవ్వడమే గాక వాటిని ధరించడంలో సాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందులో కశ్యప్ చెప్పుల్లేకుండా మోదీ వద్దకు వెళ్లి కరచాలనం చేయడం కన్పిస్తోంది. తర్వాత ఆయన్ను మోదీ తనతో పాటు కూచుండబెట్టుకున్నారు.
‘‘ఇలాంటి ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీకు పాదరక్షలు తొడుగుతున్నా. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు సుమా!’’అంటూ ప్రేమగా మందలించారు. కొత్త బూట్లు సౌకర్యంగా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ‘‘నాపై కశ్యప్ అభిమానానికి చలించిపోయాను. ఆయనకు బూట్లు ధరింపజేసే అవకాశం లభించినందుకు నిజంగా ఆనందంగా ఉంది’’అంటూ ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. ‘‘ఇలాంటి కోట్లాదిమంది అభిమానులే నా బలం. వారి ఆదరణను వినమ్రంగా స్వీకరిస్తున్నా. వారంతా సంఘసేవ ద్వారా జాతి నిర్మాణానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నా’’అన్నారు.