
గురుగ్రామ్‌లో ఆసుపత్రి సిబ్బంది ఘాతుకం
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై ఆసుపత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. 46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఎయిర్‌లైన్ శిక్షణ కోసం ఇటీవల గురుగ్రామ్‌కు చేరుకుంది. ఓ హోటల్‌లో బస చేసింది. అస్వస్థతకు గురి కావడంతో సిబ్బంది సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఈ నెల 6వ తేదీ మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స ప్రారంభించారు. అయితే, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు గుర్తించారు. ఈ నెల 13న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని భర్తకు తెలియజేశారు. తొలుత 112 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. తర్వాత తమ లాయర్ సహాయంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందించారు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.