
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో ఈ ఉదయం ప్రయాగ్‌రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఘటనలో తమ వారిని కోల్పోయిన వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. క్షతగాత్రులకు సాయం అందించడంలో అధికారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నా. ముఖ్యమంత్రి యోగితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నా అని ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ చేశారాయన. ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష జరుపుతున్నారని ఇటు యూపీ సీఎం యోగి, అటు పీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రయాగ్‌రాజ్ ఘటనపై దిగ్‌భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఘటనపై ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2 వద్ద అమృత స్నానాల కోసం వచ్చారు. ఈ క్రమంలో తోపులాటలో బారికేడ్లువిరిగిపడగా.. తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆంబులెన్స్‌లలో ఆస్పత్రలకు తరలించారు. అయితే మరణాలపై రకరకాల ప్రచారం జరిగినప్పటికీ అక్కడి అధికారులెవరూ దానిని ధృవీకరించలేదు. చివరకు ప్రధాని మోదీ ప్రకటనతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది.

అయితే ఎంత మంది మరణించారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడికి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం కాకూడదనే యూపీ ప్రభుత్వం మరణాల విషయంలో ప్రకటనేదీ చేయలేదని ఓ అధికారి జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ఘటనతో విపక్షాలు యూపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇదీ చదవండి: నిర్వహణ లోపాల వల్లే తొక్కిసలాట ఘటన.. యూపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు