
ముంబై/న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల ప్రొసీడింగ్స్‌ను ఒకే వేదిక మీదకు తెచ్చే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతు న్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ముంబైలో శనివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల కార్యకలాపాలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం త్వరలో సఫలమవనుంది.
వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ ప్లాట్‌ఫామ్‌కు ఇది బాటలు వేస్తోంది’’ అని చెప్పారు. శాసనసభ్యుల ప్రవర్తన బట్టే ఆ శాసనసభ ప్రతిష్ట ఇనుమడిస్తుందని మోదీ అన్నారు. ‘‘గతంలో సభాహక్కులను ఉల్లంఘించే సభ్యులను సీనియర్ సభ్యులు మందలించేవారు. ఇప్పుడా పరిస్థితే లేదు. తమ సభ్యులు ఎంతటి ఉల్లంఘనలకు పాల్పడినా పార్టీలు వెనకేసుకొస్తున్నాయి. ఈ సంస్కృతి మంచిది కాదు’’ అన్నారు. ‘‘ గతంలో సభ్యునిపై అవినీతి ఆరోపణలు వస్తే సమా జంలో ఆ సభ్యుడు బహిష్కరణకు గురైనట్లే.
ఆ సంస్కృతిని ఇప్పుడు గాలికొదిలేశారు. అవినీతి సభ్యులకు పాపులారిటీ పెరుగుతోంది’’ అన్నారు. యువత చేతుల్లోనే అభివృద్ధి చెందిన భారత్ రూపుదిద్దుకోనుందని మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలో ఎన్‌సీసీ–పీఎం ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘అమ్మాయిలను సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేసేవారు. వారికి అన్ని మేం రంగాల్లో ద్వారాలు తెరవడంతో తమదైన ముద్ర వేస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో నారీశక్తి ప్రస్ఫుటంగా కనిపించింది’’ అన్నారు.