
సాక్షి,బెంగళూరు: ‘నాబిడ్డకు ఇంకా మూడేళ్లే నన్ను వదిలేయండి ప్లీజ్ అని ప్రాధేయపడినా కనికరించలేదు. ఉగ్రవాది మనసు కరగలేదు. భార్య ముందే తలపై తుపాకీ ఎక్కుపెట్టి మెషిన్ గన్నుతో కాల్పులు జరిపాడు. జమ్మూకశ్మీర్‌లోని మిని స్విట్జర్లాండ్ పహల్గాంను వీక్షించేందుకు వచ్చిన సామాన్యుల్ని పొట్టన పెట్టుకున్నారు. వారిలో భరత్ భూషణ్(35)ఒకరు.
వేసవి సెలవులు కావడంతో భరత్ భూషణ్ తన భార్య డాక్టర్ సుజాత భూషణ్, మూడేళ్ల కొడుకుతో కలిసి పహల్గాంకు వచ్చారు. అప్పటి వరకు వందల సంఖ్యలో పర్యాటకలతో కళకళలాడుతున్న పహల్గాంలో సైనిక దుస్తులు ధరించిన ముష్కరులు పర్యాటకులపై విరుచుకు పడ్డారు. ఐడీకార్డులను చెక్ చేసి మరి కాల్చి చంపారు.
అలా ముష్కరుల తూటాలకు భరత్ భూషణ్ ప్రాణాలు కోల్పోయినట్లు బాధితుడి భార్య డాక్టర్ సుజాత భూషణ్ కన్నీరు మున్నీగా విలపిస్తున్నారు. కుమారుడి భవిష్యత్ గురించి ప్రాధేయపడ్డ ఉగ్రవాదులు కనికరించకుండా ప్రాణాలు తీశారని గుండెలవిసేలా రోధిస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.
మృతదేహానికి సీఎం సీఎం సిద్ధరామయ్య నివాళి
పహల్గాంలో ఉగ్రవాదుల తూటాలకు బలైన భరత్ భూషణ్ మృతదేహాం ఆయన స్వస్తలం బెంగళూరుకు చేరుకుంది. భరత్ భూషణ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు సీఎం సిద్ధరామయ్య భరత్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తన భర్త భరత్ భూషణ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన తీరు,దారుణానికి ముందు పహల్గాం ఎలా ఉందో తెలిపారు.
పహల్గాంలో కాల్పుల మోత
‘వేసవి సెలవులు కావడంతో ఏప్రిల్ 18న మేం పహల్గాంకు వెళ్లాం. అదే రోజు మేం బైసరీన్ వ్యాలీ వరకు గుర్రాల మీద వెళ్లాం. అక్కడికి చేరాక గుడారాలు వేసుకున్నాం. అనంతరం కశ్మీరీ వేషధారణలతో నా భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి సెల్ఫీలు దిగాం. పచ్చిక బయళ్లు,పైన్ చెట్లతో విశాలంగా విశాలవంతమైన ఆ ప్రాంతాన్ని కలియతిరుగుతున్నాం. పలువురు పర్యాటకు గుడారాలు వేసుకొని సందడి చేస్తున్నారు.
ఐడీకార్డులు అడిగి
సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా బుల్లెట్ శబ్ధం వినిపించింది. అడవి జంతువుల నుంచి సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు ఫైరింగ్ చేశారేమోనని అనుకున్నాం. కానీ ఆ శబ్ధం అంతటితో ఆగలేదు. కొనసాగుతూనే ఉంది. అప్పుడే ఘటన జరిగిన (ఏప్రిల్22) రోజు మధ్యాహ్నం 2.30 తర్వాత ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. టూరిస్టులను వారి ఐడీకార్డులను అడుగుతున్నారు. అనంతరం కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నారు.
మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?
బైసరీన్ గురించి మీకు తెలుసు కదా.పెద్ద మైదానం. ఎటు చూసినా ఓపెన్ స్పేస్. ఆ సమయంలో నేను, నాభర్త, నాకుమారుడికి (మూడేళ్లు) ఏ దిక్కు చూసినా తప్పించుకునే మార్గం కనిపించలేదు. వెంటనే అక్కడే ఉన్న ఓ కశ్మీర్ టెంట్ వెనక దాక్కున్నాం. మా ముందే ఓ ఉగ్రవాది ఓ టెంట్ లోపలికి వెళ్లాడు. టెంట్‌లోపల ఉన్న టూరిస్టులను బయటకు లాక్కొచ్చాడు. అతనితో ఏదో మాట్లాడాడు. అనంతరం, బాధితుడి తలపైకి గురి పెట్టి కాల్చి చంపాడు. అలా వరుసగా బాధితుల్ని కాల్చుతూ వస్తున్నాడు. మాముందే ఓ టూరిస్టుతో టెర్రరిస్టు మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా? అని అంటూ కాల్పులకు తెగబడ్డాడు.
ఇదంతా చూస్తూ మేం భయంతో మేం దాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడే మా దగ్గరికి ఓ టెర్రరిస్టు వచ్చాడు. అప్పటికే నాభర్త ఆ టెర్రరిస్టును నా బిడ్డకు ఇంకా మూడేళ్లే దయచేసి నన్ను వదిలేయండి’అని వేడుకున్నాడు. కానీ ఉగ్రవాది కనికరించలేదు’ అని అన్నటి పర్యంతరమయ్యారు.