
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే దీనికిముందే భారత్, పాకిస్తాన్ విభజనకు సన్నాహాలు మొదలయ్యాయి. 1937, ఆగష్టు 3న లార్డ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్య ప్రణాళికను సమర్పిస్తూ, భారతదేశం స్వతంత్ర దేశం కానున్నదని, అలాగే దేశం రెండు భాగాలుగా విడిపోతుందని స్పష్టంగా తెలిపారు. లార్డ్ మౌంట్ బాటన్ అందించిన ప్రణాళికను జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా అంగీకరించారు. అయితే విభజనను అమలు చేయడం అంత సులభం కాలేదు.
విభజన అంత సులభం కాలేదు
భారతదేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, దేశంలోని ఏ భాగాన్ని భారతదేశంలో ఉంచాలి? పాకిస్తాన్‌కు ఏ ప్రాంతం ఇవ్వాలో నిర్ణయించడం కష్టంగా మారింది. పలు తర్జనభర్జనల తర్వాత మత ప్రాతిపదికన విభజన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ హిందూ-ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉన్న అనేక ప్రాంతాల విషయంలో విభజన అంత సులభం కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ విభజన బాధ్యతను సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే సిరిల్ రాడ్‌క్లిఫ్ గతంలో భారతదేశాన్ని సందర్శించలేదు. అలాగే భారతదేశలోని విభిన్న జనాభా గురించి అతనికి తెలియదు.
సిరిల్ రాడ్‌క్లిఫ్ ఎవరు?
రాడ్‌క్లిఫ్ వృత్తిరీత్యా న్యాయవాది. బ్రిటన్‌లోని వేల్స్ నివాసి. అతని తండ్రి ఆర్మీ కెప్టెన్. రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌లోని హాలీ బెర్రీ కాలేజీలో చదువుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువును పూర్తి చేసిన తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డాడు. ప్రముఖ కేసులను చేపట్టడం వలన బ్రిటన్‌లో పాపులర్ అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అతను సమాచార మంత్రిత్వ శాఖలో చేరాడు. 1941లో డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యాడు. 1945లో తిరిగి న్యాయవాద వృత్తిని చేపట్టాడు.
విభజన రేఖ ఎలా గీశారు?
భారత స్వాతంత్ర్య చట్టం ఆమోదం పొందిన తరువాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య విభజనకు రేఖ గీసే బాధ్యత సిరిల్ రాడ్‌క్లిఫ్ చేతికి వచ్చింది. అతను రెండు సరిహద్దు కమిషన్లకు చైర్మన్‌గా నియమితుడయ్యాడు. అతనికి ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లిం లాయర్లు సహాయం అందించారు. 1947, జూలై 8 న సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశానికి చేరుకున్నాడు. 5 వారాల్లో విభజన రేఖను గీసే బాధ్యత అతనికి అప్పగించారు. జనాభా పరంగా బెంగాల్, పంజాబ్‌లను విభజించడం అంత సులభం కాలేదు. రెండు చోట్లా హిందూ-ముస్లిం జనాభా సమానంగా ఉండేది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ రాడ్‌క్లిఫ్ తన పనిని 12 ఆగస్టు 1947న పూర్తి చేశాడు. ఈ విభజన రేఖను అధికారికంగా 1947, ఆగస్టు 17న బహిరంగపరిచారు. దీనికి రాడ్‌క్లిఫ్ లైన్ అని పేరు పెట్టారు.
లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు?
హిందూ జనాభా ఎక్కువగా ఉన్న లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఇస్తారా లేదా అనే దానిపై చర్చ జరిగింది. ఒక ఇంటర్వ్యూలో సిరిల్ రాడ్‌క్లిఫ్ మాట్లాడుతూ విభజనకు సన్నాహక సమయంలో తాను లాహోర్‌ను భారతదేశంలోనే చేర్చానని, అయితే పాకిస్తాన్‌లో పెద్ద నగరం లేదని గమనించి, లాహోర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ విధంగా లాహోర్ స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజుల వరకూ భారతదేశంలో భాగంగా ఉంది. తరువాత అధికారిక ప్రకటనతో అది పాకిస్తాన్‌లో చేరింది. సరిహద్దును పరిష్కరించిన తర్వాత వలసలు ప్రారంభమయ్యాయి. భారతదేశం నుండి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్ నుండి భారతదేశానికి కోట్ల మంది ప్రజలు తరలివెళ్లారు. విభజన తర్వాత రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత ఎప్పుడూ భారతదేశానికి రాలేదు.
ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?