
ముంబై: మహానగరం ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తోపాటు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 10న రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.
ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ హోటల్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయి. ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా భారత్‌కు రానున్నాడనే సంగతి తెలుసుకున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్, ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ ‘సందీప్ 26/11 బాధితుడు కాదు, అతను తన కర్తవ్యం నిర్వర్తించాడు’ అని అన్నారు. రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణమని, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలని, న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులందరికీ ఇది ఒక ఆశాకిరణం’ అని ఆయన పేర్కొన్నారు. తహవ్వుర్ రాణా భారత్‌కు అప్పగించిన కారణంగా 26/11 దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో అతనికి గల సంబంధాలు బయటపడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: 26/11 టార్గెట్‌లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర?