
చెన్నై: తమిళనాడు విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఓ బాణసంచా పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పరిశ్రమలో మొత్తం 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.
గాయపడ్డవారిని శివకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పేలుడు ధాటికి బాణసంచా పరిశ్రమ పక్కనే ఉన్న రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో చిక్కుకున్నవారిని బయటికి తీసుకురావడానికి, మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.
నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన రసాయన ముడి పదార్థాలను నిల్వ చేయడం వల్లే పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జయశీలన్ ఆదేశించారు.