
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.
హోం, న్యాయ, గిరిజన సంక్షేమ, సామాజిక న్యాయం, సిబ్బంది, శిక్షణ శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కలి్పంచారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు, వీలైనంత త్వరగా తమ నివేదికను అందించేందుకు వీలుగా ఈ కమిటీ ఈనెల 23న తొలిసారి భేటీ కానుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని గత నవంబర్ 24న ఆదేశించారు. గౌబా కమిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.