
పాకిస్తాన్ మాజీ ఎంపీ దబయా రామ్ (Pic: News18 Hindi)
జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గావ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో మన దేశంలో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వారిని తమ దేశానికి పంపించేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దాయాది దేశంలో న్యాయం దొరక్కపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మనదేశానికి వలస వచ్చి బతుకుబండిని లాగిస్తున్న పాకిస్తాన్ మాజీ ఎంపీ ఒకరు వెలుగులోకి వచ్చారు.
పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎంపీ దబయా రామ్.. బండిపై ఐస్‌క్రీములు అమ్ముతూ హరియాణాలో జీవిస్తున్నారు. ఫతేహాబాద్ జిల్లాలోని రతియా తహసీల్ పరిధిలోని రతన్‌గఢ్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఇటీవల ఆయనను విచారించినట్టు న్యూస్ 18 వెల్లడించింది. విచారణ ముగిసిన తర్వాత రత్తన్‌గఢ్ గ్రామానికి తిరిగి వెళ్లేందుకు ఆయనను పోలీసులు అనుమతించారని తెలిపింది. దబయా రామ్ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు భారత పౌరసత్వం (Indian citizenship) పొందారు. మిగిలిన 28 మంది ఇప్పటికీ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్నారు.
రక్షణ కోసం ఇండియాకు వలస
దేశ విభజనకు రెండేళ్ల ముందు పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో దబయ రామ్ (Dabaya Ram) జన్మించాడు. 1947 తర్వాత కూడా ఆయన అక్కడే నివసించాడు. మతం మారాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా దబయ రామ్, ఆయన కుటుంబం తలొగ్గలేదు. 1988లో లోహియా, బఖర్ జిల్లాల నుంచి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన పదవీకాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తమ బంధువుల్లో ఓ మహిళను మతోన్మాదులు కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిచేసుకున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన దబయ రామ్‌కు చుక్కెదురైంది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు (Pakistan Supreme Court) ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. అక్కడవుంటే తమకు రక్షణ లేదని భావించిన దబయ రామ్ కుటుంబంతో సహా 2000 సంవత్సరంలో పాకిస్తాన్‌ను విడిచిపెట్టాడు.
ఆరుగురికి భారత పౌరసత్వం
బంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి ఒక నెల వీసాపై హరియాణాలోని రోహ్‌తక్‌కు వచ్చారు. తర్వాత రతన్‌గఢ్ గ్రామంలో (Rattangarh village) స్థిరపడ్డారు. తన పెద్ద కుటుంబాన్ని పోషించడానికి దబయ రామ్ ఐస్‌క్రీమ్ వాలాగా మారారు. సైకిల్ రిక్షాపై కుల్ఫీలు, ఐస్‌క్రీమ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఏడుగురు పిల్లలు వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. మొత్తం 34 మంది కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురికి భారత పౌరసత్వం దక్కింది. మిగిలిన 28 మంది దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. దబయ రామ్ మొదట్లో ఒక నెల వీసాపై తన కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చాడు. 2018 వరకు ఏటా వీసా గడువును పొడిగించుకుంటూ నెట్టుకొచ్చాడు. మొదట్లో సంవత్సరం పాటు వీసా గడువు పొడిగింపు దక్కింది. తర్వాత ఐదేళ్ల పాటు అనుమతులు లభించాయి.
చదవండి: పాకిస్తాన్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
వారికి మినహాయింపు
పెహల్‌గావ్ దాడి తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు 537 మంది పాకిస్తాన్ పౌరులు ఇండియా నుంచి తిరిగివెళ్లారు. అలాగే పాకిస్తాన్ నుంచి 240 మంది భారతదేశంలోకి ప్రవేశించారు. వారిలో 50 మంది NORI (నో అబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా) వీసాదారులు ఉన్నారు. పాకిస్తానీయులు ఏప్రిల్ 29లోపు దేశం విడిచి వెళ్లాలని భారత్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కొంత మందికి మాత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) మినహాయింపు ఇచ్చింది. దీర్ఘకాలిక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న పాకిస్తానీ హిందువులను బహిష్కరణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీర్ఘకాలిక వీసాకు అర్హత ఉండి, దరఖాస్తు చేసుకోని హిందూ వలసదారులకు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనే షరతు విధించింది.