
న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటనలోభాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగారు. తెలుగమ్మాయి, భార్య ఉషా చిలుకూరి, తమ ముగ్గురు సంతానం ఇవాన్, వివేక్, మీరాబెల్‌తో కలిసి వాన్స్ ‘ఎయిర్‌ఫోర్స్ టు’ విమానం నుంచి దిగారు. ఈ సందర్భంగా వాన్స్ దంపతులకు ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ కేంద్ర కేబినెట్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాదర స్వాగతం పలికారు.
వాన్స్‌తోపాటు అమెరికా జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్ రికీ గిల్, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. ఎయిర్‌బేస్‌లోనే కళాకారులతో ఏర్పాటుచేసిన నృత్యకార్యక్రమం వాన్స్ కుటుంబసభ్యులను అలరించింది. తర్వాత వాన్స్ భారత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వాన్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
భారతీయ దుస్తుల్లో పిల్లలు
విమానం దిగేటప్పుడు వాన్స్ ముగ్గురు పిల్లలు భారతీయ దుస్తుల్లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎనిమిదేళ్ల పెద్దకుమారుడు ఇవాన్ బూడిద రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. ఐదేళ్ల కుమారుడు వివేక్ పసుపు రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. మూడేళ్ల కుమార్తె ఆకుపచ్చ రంగు అనార్కలీ సూట్, జాకెట్ ధరించారు. అమెరికా సెకండ్ లేడీ, వాన్స్ భార్య ఉషా ఆధునిక దుస్తుల్లో కనిపించారు. స్వాగత కార్యక్రమం పూర్తయ్యాక వాన్స్ కుటుంబం ఢిల్లీకి తరలివెళ్లింది.
అక్షరధామ్ ఆలయ సందర్శన
ఢిల్లీలో తొలుత అక్షరధామ్ ఆలయాన్ని వాన్స్ కుటుంబం సందర్శించింది. యమునా తీరంలో అత్యద్భుతంగా నిర్మించిన స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని చూసి వాన్స్ కుటుంబం పులకించిపోయింది. లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నాక ఆలయం మొత్తం కలియతిరిగారు. గజేంద్రపీఠంను చూసి అచ్చెరువొందారు. ‘‘ ఇంతటి సుందర ప్రదేశంలో సాదర స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు. ఎంతో నేర్పుతో శ్రద్ధతో ఇంత అందమైన ఆలయాన్ని నిర్మించిన భారత్‌ను ప్రశంసించాల్సిందే. మా పిల్లలకు ఈ ఆలయం ఎంతో నచ్చింది’’ అని అక్కడి సందర్శకుల పుస్తకంలో వాన్స్ రాశారు. వాన్స్ దంపతులకు ఢిల్లీ అక్షరధామ్ ఆలయ నమూనాను, చెక్క ఏనుగును చిన్నారులకు చిన్నపిల్లల పుస్తకాన్ని ఆలయ నిర్వాహకులు కానుకగా ఇచ్చారు. ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉందని వాన్స్ కుటుంబం తనతో చెప్పిందని వాళ్లకు ఆలయంలో సహాయపడిన మీరా సోందాగర్ చెప్పారు. తర్వాత వాన్స్ దంపతులు జన్‌పథ్‌లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంను సందర్శించారు. అక్కడ కొన్ని భారతీయ హస్తకళలను కొనుగోలుచేశారు. ఢిల్లీలో ఉన్నంతసేపు వాన్స్ కుటుంబం ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్‌లో బసచేయనుంది.
ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకే..
గతంలో అమెరికా ఉపాధ్యక్షులు విచ్చేసినప్పుడు కేంద్ర సహాయ మంత్రి, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వంటి వారు మాత్రమే స్వాగతం పలికారు. ఈసారి ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఏకంగా కేంద్ర కేబినెట్ మంత్రి అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. కేబినెట్ ర్యాంక్ స్థాయి నేత ఇలా స్వయంగా ఆహ్వానం పలకడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 2023 సెపె్టంబర్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చినప్పుడు పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. బైడెన్ 2013లో ఉపాధ్యక్ష హోదాలో వచ్చినప్పుడు నాటి విదేశాంగ శాఖ కార్యదర్శి రంజన్ మథాయ్ స్వాగతం పలికారు. ట్రంప్ అధ్యక్షునిగా 2020లో వచ్చినపుడు కేబినెట్ మంత్రి కాకుండా కేవలం సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ ట్రంప్‌కు స్వాగతం పలికారు. సుంకాల భారం మోపుతూ భారత్ పట్ల ఆగ్రహం ఉన్న ట్రంప్ సర్కార్‌ను వాన్స్ ద్వారా ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ ఇలా కేబినెట్ మంత్రిని పంపించి సాదరంగా ఆహ్వానించింది.
నేడు జైపూర్‌లో సందర్శన
మంగళవారం ఉదయం నుంచి జైపూర్‌లోని పలు చారిత్రక ప్రదేశాలను వాన్స్ కుటుంబం సందర్శించనుంది. తొలుత జైపూర్‌లోని రామ్‌భాగ్ ప్యాలెస్‌లో బస చేస్తారు. మంగళవారం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన అంబర్ కోటకు వెళ్తారు. సాయంత్రం జైపూర్‌లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో వాన్స్ ప్రసంగిస్తారు. బుధవారం ఉదయం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. తర్వాత భారతీయ శిల్పకళల ప్రదర్శనశాల అయిన శిల్పాగ్రామ్‌కు వెళ్తారు. సాయంత్రం మళ్లీ జైపూర్‌కు వస్తారు. జైపూర్ నుంచి గురువారం ఉదయం అమెరికాకు బయల్దేరతారు.