
ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుధ్దాన్ని పక్షపాత ధోరణితో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డుకోవాలని చూడటం దురదృష్టకరం. గ్లోబెల్స్ ప్రచారం కూడా..
భారతదేశ సమగ్రతపై పక్కా ప్లాన్ ప్రకారమే తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హెచ్చరించారు. గ్లోబెల్స్ ప్రచారం కూడా చిన్నబోయేలా ఈ దాడి జరుగుతోందన్నారు. ఈమేరకు ఆయన ఓ వార్త సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుధ్దాన్ని పక్షపాత ధోరణితో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డుకోవాలని చూడటం దురదృష్టకరం అన్నారు. అవినీతి అంశాన్ని ఎలా రాజకీయ కోణంలో చూడగలమని ప్రశ్నించారు.
కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తమను టార్గెట్ చేస్తుందంటూ.. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలోనే ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ న్యాయవ్యవస్థ పట్ల గర్విస్తోందని అన్నారు. ఎవరికైనా పరువు నష్టం వాటిల్లందంటే తక్షణమే ఉపశమనం పొంది, న్యాయం చేకూరేలా చేసే సుప్రీం కోర్టులాంటి న్యాయవస్వయస్థ ఎక్కడ లభిస్తోందన్నారు. అయినా ఈ అంశంపై మాకు పాఠాలు చెప్పడానికి ప్రపంచంలో ఎవరికీ చట్టబద్ధత గానీ అందుకు సంబంధించి సాక్ష్యాధారాలు గానీ వారి వద్ద లేవని నొక్కి చెప్పారు.
రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటును గమనిస్తున్నాం అని జర్మని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ధన్‌ఖర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేగాదు తన ప్రసంగంలో భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారమే దాడి జరుగుతోందని, అందుకోసం దేశం లోపల, వెలుపల కొన్ని దుష్ట శక్తుల పనిచేస్తున్నాయన్నారు. అంతేగాదు భారతదేశ వృద్ధిని కుంటిపరిచే ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తోందని ఆరోపించారు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇతర దేశాల్లో తన సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు. ఇలాంటి వాటికి ప్రజలు కచ్చితం అడ్డుకట్ట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ధన్‌ఖడ్.