
పాక్ మహిళ తిరుగు ప్రయాణం
భువనేశ్వర్: పాకిస్తాన్ జాతీయురాలు నగ్మా యూసుఫ్ ఆదివారం భువనేశ్వర్ నుంచి బయలుదేరింది. స్వదేశానికి తిరిగి పంపడానికి ఇక్కడి అధికారులు గుర్తించిన పొరుగు దేశానికి చెందిన 12 మంది పాకిస్తాన్ పౌరులలో ఆమె ఒకరు. 2008 సంవత్సరంలో భారతీయ పౌరుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను వివాహం చేసుకుంది. తర్వాత ఆమె దీర్ఘకాలిక వీసాపై స్థానిక బీజేబీ నగర్ ప్రాంతంలో నివసిస్తోంది. వీసా పునరుద్ధరణ కోసం చేసిన దరఖాస్తులు తిరస్కరించిన తర్వాత ఆమె ఇటీవలే విజిటర్ వీసా పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విజిటర్ వీసా గడువు ముగియడానికి కొన్ని రోజుల ముందుగా ఆమె కమిషనరేట్ పోలీస్‌లోని విదేశీయుల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఆ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ పచ్చిక బయళ్లలో పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడిలో 26 మంది మరణించిన తర్వాత కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆమె దేశం విడిచి వెళ్లమని కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తును ఆమోదించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లమని ఆమెకు నోటీసు ఇచ్చింది.
సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
కొరాపుట్: సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని దసరాపొద నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లే మార్గంలో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు సంఘం అధ్యక్షుడు రాధా నాధ్ బెహరా ఆదివారం ప్రారంభ పూజలు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి భూమి పూజ చేశారు. గత ఎమ్మెల్యే సదాశివ ప్రదాని తన కోటా నిధులు రు.4 లక్షలు ఇవ్వగా ప్రస్తత ఎమ్మెల్యే గౌరీ మరో రు.4 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈ భవనం కోసం ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించింది.
ఇంటికి కూరలు తేవాలి కదా..!
కొరాపుట్: దేశానికి రాజైనా ఇంటికి యజమానే కదా. సోమవారం నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి రాయగడ జిల్లా పర్యటనకి పయనమయ్యారు. మార్గ మధ్యంలో ఆకు కూరలు కనిపించాయి. తన కాన్వాయ్ ఆపించి వాటిని బేరమాడి కొనుక్కున్నారు. నిత్య ప్రజా జీవితంలో సతమతమవుతున్నప్పటికీ తాను కూడా ఒక ఇంటికి యజమాని అని గుర్తుకు తెచ్చుకొని ఆ ఆకుకూరలు సంచిలో వేసుకొని బయలు దేరారు.

పాక్ మహిళ తిరుగు ప్రయాణం