
దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోండి
నరసరావుపేట: శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామంలో టీడీపీ కూటమి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుందని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర కమిటీ సభ్యులు ఓర్సు శ్రీనివాసరావు ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్‌కు గంటావారిపాలెం బాధితులతో హాజరై వారికి జరిగిన అన్యాయంపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన గ్రామంలోని ఎరుకలవాడలో కుంభా యోగయ్య రూ.16 లక్షలతో నిర్మించుకున్న చికెన్, కిరాణా షాపులను ఆ గ్రామ పెత్తందారులు కొనకంచి వెంకట్రావు, మురళి, మాదినేని మధుసూదనరావు, గోపు రామకృష్ణ, రావి హరివెంకట నరసింహారావులు పొక్లెయిన్‌తో కూల్చివేశారన్నారు. దీనికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసి నిందితులను అరెస్టుచేసి బాధితులకు రక్షణ కల్పించాల్సిన శావల్యాపురం ఎస్‌ఐ ఆ పనిచేయకపోగా బాధితులు ఎస్టీలు కాదని, బీసీలని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌లో బాధితులు తమకు మండల తహసీల్దారు గతంలో ఇచ్చిన కుల ధృవీకరణ సర్టిఫికెట్లను అందజేశారన్నారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీ స్పందించి ఎరుకల కులస్తుల షాపులను కూల్చి వారిని కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంతేగాకుండా వారిని వెంటనే అరెస్టు చేసి, బాధితులకు రక్షణ కల్పించడంతోపాటు రూ.18లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కేఎన్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్నప్రసాద్, సహాయ కార్యదర్శి జక్కా బ్రహ్మయ్య, చలంచర్ల అంజి, హనుమంతరావు, కుంభా హనుమంతరావు, సుజాత బాధితులు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీల గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను
కోరిన బాధితులు