రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Published Tue, Apr 29 2025 7:09 AM | Last Updated on Tue, Apr 29 2025 7:09 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

అచ్చంపేట: ఎదురుగా వస్తున్న బైక్‌ని ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని చెరుకుంపాలెం ఆర్‌ అండ్‌ బీ రోడ్డు మలుపులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడువాయికి చెందిన వేమవరపు ప్రకాష్‌ మంగళవారం గ్రామంలో జరిగే చర్చి ప్రారంభోత్సవానికి కస్తలలో ఉంటున్న సోదరి జ్యోత్స్నతో పాటు కూతురు అక్షయ (2)ను తీసుకుని బైక్‌పై తీసుకుస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో చిన్నారి అక్షయ కిందపడి అపస్మారకస్థితికి వెళ్లింది. వెంటనే సమీపంలోని వెద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉదయాన్నే కుమారై అక్షయతో కలసి కస్తల వెళ్లిన ప్రకాష్‌ తిరుగు ప్రయాణంలో ఇలా జరగడం దురదృష్టకరం. జ్యోత్స్నకు కుడికాలు, కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనున్న మరో మహిళ మహిమ కూడా మోస్తరు గాయాలవ్వడంతో అంబులెన్స్‌లో సత్తెనపల్లి తరలించారు. సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు, పాఠకులు రోజులో కొంత సమయాన్ని గ్రంథాలయంలో గడిపి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. సోమవారం బృందావన్‌ గార్డెన్స్‌లోని మహిళా బాలల గ్రంథాలయలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో భద్రపర్చిన పురాతన గ్రంథాలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం గ్రంథాలయాలకు వచ్చే విద్యార్థులు, పాఠకుల సంఖ్య తగ్గిపోతోందని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ ఎ.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు కథలు చెప్పడం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ , డ్రాయింగ్‌, పెయింటింగ్‌, పేపర్‌ క్రాఫ్ట్‌, డాన్స్‌, జీకే తదితర అంశాల్లో శిక్షణ కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఏవీకే సుజాత, పౌర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సీహెచ్‌. దీక్షితులు, జిల్లా గ్రంథాలయ సంస్థ సీనియర్‌ అసిస్టెంట్‌ మల్లంపాటి సీతారామయ్య, విశ్రాంత గ్రంథ పాలకుడు ఎస్‌ఎం సుభాని, అధ్యాపకుడు శివారెడ్డి, మహిళా బాలల గ్రంథాలయ అధికారులు బి.శకుంతల, పి.సత్య శిరీష, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్‌గా బందా

పట్నంబజారు: పదవీ విరమణ తమ బాధ్యతలు ముగిశాయని కాకుండా, సామాజిక సేవతో పది మందికి మేలు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని ఎమ్మెల్సీ, స్ఫూర్తి ఫౌండేషనన్‌ వ్యవస్థాపకులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) విశ్రాంత ఉద్యోగుల నడవడికే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఎఫ్‌సీఐ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఛైర్మన్‌గా స్ఫూర్తి ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి, గుంటూరు అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ బందా రవీంద్రనాథ్‌ తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు అమరావతి రోడ్డులోని మల్లేశ్వరి ఫంక్షన్‌ హాలులో సోమవారం జరిగిన రాష్ట్ర సమావేశంలో ఈమేరకు ఎన్నికలు నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన ఆలిండియా వైస్‌ చైర్మన్‌ ఏఎస్‌ రామారావు, తాడేపల్లిగూడేనికి చెందిన కె సుధాకరరావు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. బందా రవీంద్రనాథ్‌తోపాటు రాష్ట్ర వైస్‌ చైర్మన్‌గా రాజమండ్రికి చెందిన కె.నాగేశ్వరరావు, కార్యదర్శిగా భీమవరానికి చెందిన జి. గోపాలరావు, సహాయ కార్యదర్శిగా విజయవాడకు చెందిన ఆర్‌. సాయిబాబు, కోశాధికారిగా పశ్చిమ గోదావరికి చెందిన డి మురళీమోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా చైర్మన్‌గా పి. యలమంద, కోశాధికారిగా ఎస్‌.ప్రభాకరరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బందా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ 1990 నుంచి యూనియన్‌ వ్యవహారాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అనేక హోదాలలో పనిచేస్తూ 2022లో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్‌గా ఎంపికై నట్లు చెప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విశ్రాంత ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నేతలు నల్లయ్య, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి 1
1/2

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి 2
2/2

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement