
అక్రమ జంతు రవాణాపై విస్తృత తనిఖీలు
పిడుగురాళ్ల: వన్య ప్రాణుల అక్రమ రవాణా అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి జి. కృష్ణప్రియ ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు రేంజ్‌లు పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, నర్సరావుపేటలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. వన్య ప్రాణులు, వృక్ష సంపద పరిరక్షణపై వాహనదారులకు, ప్రజలకు, అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా వినుకొండ, బొల్లాపల్లి, కారంపూడి, దుర్గి, మాచర్ల, పాపాయపాలెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, బెల్లంకొండ, పాపాయపాలెం, నకరికల్లు, అచ్చమ్మపేట ప్రాంతాల్లో నాకాబంది నిర్వహించారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్లు కె. విజయకుమారి, పి. మాధవరావు, డి. వెంకట రమణ, విజయలక్ష్మితో జిల్లాలోని ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.
మావోయిస్టులతో
శాంతి చర్చలు జరపాలి
పిడుగురాళ్ల: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులోని సున్నపు బట్టీల సెంటర్‌లో ఆదివారం ప్రజా సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత వారం రోజు నుంచి 12 వేల మందికి పైగా సాయిధ పోలీసులు, సైనిక బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని కోరారు. హెలికాప్టర్, డ్రోన్లను మోహరించి ఆదివాసీలు, మావోయిస్టులను హతమార్చే లక్ష్యంతో జరగుతున్న ఈ దాడిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు కె. శ్రీనివాసరావు, వై. వెంకటేశ్వరరావు, భారత్ బచావో జిల్లా కార్యదర్శి షేక్ సర్దార్, ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్రహాం లింకన్, జిల్లా కార్యదర్శి ఓర్సు కృష్ణ పాల్గొన్నారు.
ఇగ్నో కోర్సులతో
ఉద్యోగావకాశాలు పుష్కలం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తున్న కోర్సులతో పుష్కలమైన ఉగ్యోగావకాశాలు లభిస్తున్నాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ పి.శరత్‌చంద్ర పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల ప్రాంగణంలోని ఇగ్నో అధ్యయన కేంద్రంలో ఆదివారం 2025 జనవరిలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. శరత్‌చంద్ర మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న వివిధ రకాల కోర్సుల గురించి వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఇగ్నో అందిస్తున్న మెటీరియల్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇగ్నో సైట్‌లో పొందుపరచి ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా చదువుకోవాలని చెప్పారు. ఇగ్నో అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే లక్ష్యం కలిగిన వారు ఇగ్నో ద్వారా వారి ఆశయాన్ని నెరవేర్చుకోవాలని సూచించారు. ఇగ్నో వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్స్ గురించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అధ్యయన కేంద్ర కౌన్సిలర్ డాక్టర్ ఎంఎస్ నారాయణ, సహాయ సమన్వయకర్తలు డాక్టర్ పి.దేవేంద్ర గుప్త, ఎం.మార్కండేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ జంతు రవాణాపై విస్తృత తనిఖీలు

అక్రమ జంతు రవాణాపై విస్తృత తనిఖీలు