
భద్రతకు భరోసా
● సింగరేణిలో సేఫ్టీ మేనేజ్‌మెంట్ అమలు ● ఏటా తగ్గుతున్న బొగ్గుగని ప్రమాదాలు ● ఎస్‌వోపీ, సీవోపీపై ప్రత్యేక దృష్టి ● ప్రతీఒక్కరికి రక్షణ పరికరం పంపిణీ ● సగానికి తగ్గిన ప్రమాదాలు
గోదావరిఖని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలోని సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాజమాన్యం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు, కార్మికుల అప్రమత్తత ఇందుకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. 2021 సంవత్సరంలో జరిగిన ప్రమాదాల్లో 13 మంది ఉద్యోగులు చనిపోతే.. గతేడాది ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గింది. 2021లో సీరియస్ ప్రమాదాలు 122 జరిగితే.. గతేడాది 88 ప్రమాదాల్లో 88మందికి తీవ్ర గాయాలయ్యాయని సింగరేణి రికార్డులు చెబుతున్నాయి.
ప్రతీ కార్మికుడికి రక్షణపై ప్రత్యేక శిక్షణ
ప్రతీకార్మికునికి వృత్తి శిక్షణతోపాటు పీరియాడికల్ ట్రైనింగ్ ఇస్తూ రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. కీలకప్రాంతాల్లోని కోల్‌కట్టర్‌లు, ట్రామర్లకు రెండేళ్ల కోసారి రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌వోపీ), కోడ్ ఆఫ్ ప్రాక్టీస్(సీవోపీ)పై ప్రతీఒక్కరిపై తర్ఫీదు ఇస్తున్నారు. పనిస్థలాల్లో ప్రమాదాల నియంత్రణకు పనిపై అవగాహన పెంచుకోవడం ఒక ఎత్తయితే.. కార్మికులు తమ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం కీలకంగా మారుతోంది. దీంతో ప్రమాదాలు తగ్గుతున్నాయి.
సూపర్‌వైజర్లపై ప్రధాన దృష్టి
పనిస్థలాలను పర్యవేక్షించే సూపర్‌వైజింగ్ సిబ్బందికి ప్రమాదాల నియంత్రణపై సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఎంపీ)పై శిక్షణ ఇస్తున్నారు. ప్రమాద ప్రాంతాలు సందర్శించి ఘటనకు దారితీసిన అంశాలపై అధ్యయనం చేసేందుకు రూట్‌కెనాల్ అనాలసిస్ చేపడుతున్నారు. అలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ఇది ఎంతోదోహదం చేస్తోంది.
సేఫ్టీటూల్స్ వినియోగంపై..
సింగరేణిలోని అన్ని విభాగాల ఉద్యోగులకు యాజమాన్యం సేఫ్టీ మెటీరియల్ అందిస్తోంది. బూట్లు, టోపీ, లైట్‌తోపా పీపీఈ కిట్లు సరఫరా చేస్తోంది. ట్రేడ్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు, కార్మికులు సేఫ్టీ టూల్స్ వినియోగించడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. ఎలక్ట్రికల్ ఉద్యోగులు విద్యుత్ షాక్‌కు గురికాకుండా ప్రత్యేకమైన షూస్ అందిస్తోంది. ఒక్కోసారి 11 కేవీషాక్ వచ్చినా తట్టుకునేలా ఈ షూస్ పనిచేస్తాయని యాజమాన్యం చెబుతోంది.
మెటీయల్ తరలింపుపైనా..
భారీ యంత్ర, పరికరాలు, ఇతర వస్తువుల తరలింపుపైనా యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. లోడింగ్, అన్‌లోడింగ్ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటోంది. బరువు ఎత్తే సమయంలో సేఫ్టీ యంత్రాలు వినియోగిస్తోంది. తద్వారా ప్రమా దాలు తగ్గాయని యాజమాన్యం చెబుతోంది.
భూగర్భ గనుల్లో గతంలో తరచూ ప్రమాదాలు అధికంగా జరిగేవి. పనిస్థలాల్లో రక్షణ చర్యలు పటిష్టం చేయడంతో ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయి.
ప్రమాదాల నియంత్రణపై ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గింది.
మానవతప్పిదాలతో ఎక్కడైనా ప్రమాదం జరిగితే నియంత్రణకు సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్లాన్ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
ప్రమాద ప్రాంతాలకు సూపర్‌వైజర్లను పంపించి రూట్‌కెనాల్ అనాలసిస్ ద్వారా నివేదిక తయారు చేస్తున్నారు. అలాంటి ప్రమాదాలు పునావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

భద్రతకు భరోసా