
జలవెల!
● అడుగంటుతున్న జలాశయాలు ● ఎల్‌ఎండీ డెడ్‌స్టోరేజీకి రాలేదంటున్న అఽధికారులు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎనిమిది టీఎంసీలు ● మిడ్ మానేరులోనూ అదే తీరు ● సాగునీటికి ఇబ్బందులు లేవంటున్న ఇరిగేషన్‌శాఖ
ఎల్లంపల్లిలో 8.76 టీఎంసీలు
20.175 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 8.76 టీఎంసీల నీరు ఉంది. గతేడాది ఇదే రోజు 6.75టీఎంసీల నీరు ఉండేది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 2టీఎంసీల నీరు ఎక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలకు ఢోకాలేదని సబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మె ట్రోవర్క్ స్కీం (హెచ్‌ఎండబ్ల్యూఎస్) కోసం 330 క్యూసెక్కులు, రామగుండంలోని ఎన్టీపీసీ పంప్ హౌజ్‌కు 121 క్యూసెక్కులు, పెద్దపల్లి, రామగుండం మిషన్ భగీరథ పథకం కోసం 58 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మంచిర్యాల జిల్లా ప్ర జల తాగునీటి అవసరాల కోసం 23 క్యూసెక్కుల ను విడుదల చేస్తున్నారు. ఎండల కారణంగా 190 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రతిరోజు ప్రాజె క్టు నుంచి 723 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రస్తు తం ప్రాజెక్ట్‌లోని నీరు జూన్ వరకు తాగునీటి అవసరాలు తీరుస్తుందని అధికారులు వెల్లడించారు.
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు క్రమంగా అడుగంటుతున్నాయి. వరదకాలువ, కాళేశ్వరం నుంచి కొంతకాలంగా ఎత్తిపోతలు లేకపోవడంతో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తయిన నేపథ్యంలో వ్యవసాయపరంగా ఇబ్బందులు లేవని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు జూన్ వరకు సరిపోతుందని, తాగునీటికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. దంచికొడుతున్న ఎండల నేపథ్యంలో రోజుకు పదుల సంఖ్యలో క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. తాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితే ఉత్పన్నమవదని, ఆలోపు వర్షాలు వచ్చేస్తాయని ఇరిగేషన్‌శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
లోయర్ మానేరులో ఏడు టీఎంసీలు
లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం ఏడు టీఎంసీల నీరు నిల్వఉంది. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. మిషన్ భగీరథకు డెడ్‌స్టోరేజీ 3.8 టీఎంసీలు, కాగా సాధారణ డెడ్‌స్టోరీజీ 2 టీఎంసీలుగా పరిగణిస్తామని తెలిపారు. తాగునీటి అవసరం కోసం ప్రాజెక్టు నుంచి ఇప్పటి నుంచి జూలై నెలవరకు వరకు రోజుకు సుమారు 300 క్యూసెక్కుల నీటిని వాడుకున్నా.. 1.5 టీఎంసీలు అవసరం అవుతుంది. ఇతర అవసరాలకు టీఎంసీ కావాలి. 3.8 టీఎంసీల కన్నా దిగువకు వస్తే ఎలగందుల, పరిసర ప్రాంతాలకు మాత్రం ఇబ్బందిగా మారుతుంది. ఆలోపు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
మిడ్‌మానేరులో 7.074 టీంఎసీలు
మిడ్‌మానేరు జలాశయం నుంచి పంటలకు, తాగునీటి అవసరాలకు ఇప్పటి వరకు కరీంనగర్ ఎల్‌ఎండీ ప్రాజెక్ట్‌లోకి 20 టీఎంసీల మేర నీరు తరలింది. ఎండలకు రోజుకు 140 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. జూలై వరకు ఒకటిన్నర టీఎంసీ నీరు ఆవిరి కానుంది. మిడ్ మనేరు ప్రాజెక్ట్ నుంచి సిరిసిల్ల జిల్లాకు రోజుకు మిషన్ భగీరథ కింద 40క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. జూలై 31వరకు మిడ్ మానేరులో తాగునీటి అవసరాలకు నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేదని మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఈఈ జగన్ తెలిపారు. 2024 ఏప్రిల్ 21న ప్రాజెక్ట్‌లో 5.96 టీఎంసీల నీరు ఉంటే ఇప్పుడు 7.074 టీఎంసీల మేర నీరు ఉందని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ఎక్కువగా ఉందన్నారు.

జలవెల!