
ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి మధ్య పార్లమెంట్‌లో..
సాక్షి, ఢిల్లీ: రేపటి నుంచి(జులై 20 నుంచి..) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాన్ను నేపథ్యంలో.. అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ అన్ని పార్టీల ప్రతినిధులతో కేంద్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు కేబినెట్ సీనియర్ మంత్రులు.. సభావ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరడం ఆనవాయితీ. చాలాసార్లు ఈ భేటీకి ప్రధాని సైతం హాజరవుతుంటారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇదే తరహాలో మంగళవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్(ఉపరాష్ట్రపతి) మంగళవారం భేటీ నిర్వహిచంగా.. చాలా పార్టీలు గైర్హాజరు అయ్యాయి. హస్తినలో అధికార ఎన్డీయే కూటమి బలప్రదర్శన, మరోవైపు బెంగళూరులో విపక్ష కూటమి భేటీ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఈసారి వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగొచ్చు. ‘జాతీయ ప్రజాతంత్ర కూటమి’ (ఎన్డీయే) కూటమి వర్సెస్ విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్(ఐఎన్‌డీఐఏ) మధ్య పరిణామాలు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై కేబినెట్ సహచరులు ప్రహ్లాద్ జోషి(పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి), పీయూష్ గోయల్(రాజ్యసభ నేత)లతో చర్చించారు. ఆపై ఎన్డీయే మిత్రపక్షాలతోనూ బీజేపీ నేతలు ఇవాళ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.