
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతికి రూ.15, 000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఏపీ కూటమి ప్రభుత్వ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ సెటైర్లు వేశారు.
అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే
గొప్పలు చెప్పుకుంటున్నారు!
సంపద సృష్టించడం అంటే అప్పులు
తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024
కాగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు.
సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.