
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ధరణి, భూ భారతి అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో నినాదాలు కొనసాగుతున్నాయి.
ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ధరణి, భూ భారతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే. కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది. భూస్వాముల చట్టం ధరణి. లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాశారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. దున్నేవాడితే భూమి కదా సాయుధ పోరాట నినాదం. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి. బంగాళాఖాతంలో ధరణిని వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేశాం.. కొత్త చట్టం తెచ్చాం. జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు. ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.
భూ భారతి కాదు.. భూ హారతి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
భూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే.. మేము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదు భూ హారతి. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచింది. ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలి.
భవిష్యత్‌లో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం: పొంగులేటి
పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ఓడించారు. ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు. 2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం.