
రేవంత్ బుల్డోజర్ పాలనపై మౌనం ఎందుకు?
మీరు చెప్పే నీతి సూత్రాలు మీ సీఎం తుంగలో తొక్కుతున్నారు
రాహుల్‌గాందీకి బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బోధిస్తున్న నీతి సూత్రాలను తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కుతున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఓ వైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుండగా, రేవంత్ తన అనాలోచిత చర్యలతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాందీని ఉద్దేశిస్తూ హరీశ్‌రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో వికృత పాలన సాగుతోందని ఆరోపించారు.
‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చట్టం చేస్తామని మీరు అంటున్నా, రేవంత్‌రెడ్డి మాత్రం బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? రేవంత్ విధ్వంసపూరిత వైఖరితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జంతుజాలం ఆవాసాన్ని కోల్పోయింది. వర్సిటీ అంశంలో మీ పార్టీ అనుబంధ విభాగం ఎన్‌ఎస్‌యూఐ సహా అన్ని వర్గాలు రేవంత్ ప్రభుత్వ తీరును ఖండించాయి’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ విధ్వంసం మీ అనుమతితోనే సాగుతోందా?
‘రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్‌సీయూ సందర్శన వచ్చిన మీకు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్‌తో పంపి నిరసన తెలిపే అవకాశం కల్పించింది. ఆపదలో అండగా ఉంటానని హెచ్‌సీయూ విద్యార్థులకు మీరు హామీ ఇచ్చినా.. రేవంత్ దుర్మార్గాలపై మౌనం వహించడం ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంతరవరకు వర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసకాండ కొనసాగించింది. క్రోనీ కాపిటలిజం, అదానీ వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా మీరు పోరాటం చేస్తున్నారు.
కానీ మీ సీఎం రేవంత్ తెలంగాణలో అదానీకి ఎర్ర తివాచీ పరిచారు. నల్లగొండలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో ఫార్మా విలేజ్ మూలంగా భూములు కోల్పోతున్న రైతులపై దాడులు జరుగుతున్నా మీరు మౌనంగానే ఉన్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండ, విధ్వంస పాలన మీ అనుమతితో కొనసాగుతోందా?’అని రాహుల్‌గాం«దీని హరీశ్‌రావు ప్రశ్నించారు.