
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc) ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక విడుదలతో లగచర్ల బాధితులు హైదరాబాద్ నందినగర్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలి. లగచర్లలో మహిళలపై దాడి చేశారు. బాధితుల పకక్షాన ఎన్‌హెచ్‌ఆర్‌సీని సంప్రదించాం. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతాం. లగచర్లలో ఓవర్ యాక్షన్ చేసిన అధికారులను వదలం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.